ఆర్టీసీ ‘సవరణ’బకాయిల చెల్లింపునకు ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఇటీవల జరిగిన వేతన సవరణకు సంబంధించిన బకాయిల తొలి విడత చెల్లింపునకు మార్గం సుగమమైంది. ఇందుకు అవసరమైన రూ.250 కోట్ల మొత్తాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సమ్మతించినట్లు తెలిసింది. సవరించిన వేతనాలను 2013 నుంచి అమలు చేయనున్నట్టు ఫిట్‌మెంట్ ప్రకటన సమయంలో ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రూ.1500 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇందులో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించనున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం, మిగతా మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో దసరాకు మొదటి విడత చెల్లించాల్సి ఉంది. కాని ప్రస్తుతం ఆర్టీసీ వద్ద చిల్లిగవ్వ లేకపోవటంతో అధికారులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ మొత్తాన్ని చెల్లించేం దుకు ప్రభుత్వం అంగీకరించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వు సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది.