
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 23న జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నిమజ్జన వేడుకలకు తరలి వచ్చే భక్తుల కోసం 550 బస్సులను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే బ్రేక్‌డౌన్‌లు చోటుచేసుకోకుండా, బస్సుల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సమర్థవంతంగా బస్సులను నడిపేందుకు ప్రత్యేకంగా అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు తదితరులతో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొనేందుకు కమిషనర్ కార్యాలయంతో పాటు, ప్రధాన మార్గాల్లోని పోలీస్‌స్టేషన్‌లు, ట్రాఫిక్ కూడళ్లలో ప్రత్యేకంగా కొంతమంది అధికారులను నియమించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. 33 మంది అధికారులు, 40 మంది సూపర్‌వైజర్లు, 70 మంది మెకానిక్‌లు, 100 మంది డ్రైవర్లు, 50 మంది సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి బస్సుల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటిస్తారు.
ఈ రూట్లలో ప్రత్యేక బస్సులు
బషీర్‌బాగ్ నుంచి కాచిగూడ, రాంనగర్, ఓల్డ్‌ఎమ్మెల్యేక్వార్టర్స్ నుంచి కొత్తపేట్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, మిధాని, హిమాయత్‌నగర్ నుంచి ఉప్పల్, ఇందిరాపార్కు నుంచి ఉప్పల్, రిసాలాబజార్, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్, మల్కాజిగిరి,జామై ఉస్మానియా, తదితర రూట్లలో అదనపు బస్సులు నడుస్తాయి. అలాగే లకిడికాఫూల్ నుంచి టోలీచౌకి, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ నుంచి బీహెచ్‌ఈఎల్, కొండాపూర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, సనత్‌నగర్,బాచుపల్లి, లింగంపల్లి, కేపీహెచ్‌బి, పటాన్‌చెరు. ఖైరతాబాద్ నుంచి సికింద్రాబాద్, తదితర రూట్లలో 550 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
ప్రత్యేక కంట్రోల్ రూం
బస్సుల నిర్వహణలో ఇబ్బందులను అధిగమించేందుకు ఆఫ్జల్‌గంజ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, నారాయణగూడ, ఇందిరాపార్కు, ఖైరతాబాద్, సరూర్‌నగర్‌లలో రిలీఫ్‌వ్యాన్‌లను, మెకానిక్‌లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఉదయం 7 గంటల నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కంట్రోల్ కేంద్రం ద్వారా ప్రయాణికుల సలహాలను, సూచనలు, ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తారు. ప్రయాణికులు 9959224058 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment