అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి మరీ తమ అనుయాయులు..
ఇందిరమ్మ ఇళ్ల అక్రమాల్లో వారిదే పాత్ర
సీఐడీ విచారణలో తేటతెల్లం
ఆసిఫాబాద్‌లో పార్టీ నాయకులపై విచారణ
11 మంది నేతల అక్రమాలు వెలుగులోకి..
16, 17న ఖానాపూర్, గిన్నెరలో విచారణ
పలుకుబడి ఉపయోగించే పనిలో నాయకులు
సాక్షి, మంచిర్యాల : అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి మరీ తమ అనుయాయులు.. బం ధువులకు అక్రమంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించిన ప్రజాప్రతినిధుల గుట్టురట్టవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై ఇప్పటికే బోగస్ లబ్ధిదారులు.. హౌసింగ్ క్షేత్రస్థాయి సిబ్బంది.. మండల స్థాయి అధికారులను ప్రశ్నించిన సీఐడీ అధికారులు వారి ఫిర్యాదు మేరకు ప్రజాప్రతినిధులు, నాయకులనూ విచారించే పనిలో పడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై తుది విచారణను త్వరితగతిన పూర్తిచేసేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పదకొండు మంది ప్రజాప్రతినిధులు, నాయకులను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.
విచారణలో వారిచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఖానాపూర్ మండలం తిమ్మాపూర్, ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతిని ధులను విచారించనున్నారు. సాధ్యమైనంత త్వరగా తొలి విడత విచారణ పూర్తి చేసి నెలాఖరులోగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సీఐడీ డిఎస్పీ రవికుమార్ తెలిపారు. జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్ మండలం బాబాపూర్, తిమ్మాపూర్ (ఖానాపూర్ మండలం), కిష్టాపూర్ (రెబ్బెన), గిన్నెర (ఇంద్రవెల్లి) గ్రామాల్లో సీఐడీ అధికారులు ఈ ఏడాది ఆగస్టులో ఇం దిరమ్మ ఇళ్ల అక్రమాలపై తొలి విడత విచారణ చేపట్టారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా 109 మంది అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించిన అధికారులు నవంబర్‌లో వారి పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి సమర్పించారు. అదే నెల 11న సీఐడీ వరంగల్ రీజినల్ కార్యాలయంలో 30 మంది అధికారులు, సిబ్బందిని విచారించారు. అధికారులిచ్చిన వివరణలో పలువురు ప్రజాప్రతినిధుల పేర్లూ ఉండడంతో వారినీ విచారిం చేందుకు అనుమతి తీసుకున్నారు. అర్హత లేకున్నా బం దుప్రీతితో తన వాళ్లకు ఇళ్లు మంజూరు చేయించుకున్న, బినామీ పేర్లతో ఇళ్లు మంజూరు చేయించుకుని వాటిని అమ్ముకున్న ప్రజాప్రతినిధులను విచారిస్తున్నారు.
అక్రమార్కుల ‘రాజకీయం’
ఇందిరమ్మ ఇళ్ల అక్రమాల్లో ప్రజాప్రతినిధుల ప్రమేయం నిర్ధారణ కావడంతో వీరిపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందోనని జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఉద్యోగులు, లబ్ధిదారులు, దళారుల అక్రమాలు రుజువైన నేపథ్యంలో అక్రమార్కులైన ప్రజాప్రతినిధులకూ శిక్ష పడాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే అక్రమాలకు పాల్పడ్డ ప్రజాప్రతినిధులు, నాయకులు సమస్య నుంచి గట్టెక్కేందుకు రాజకీయాలు ప్రారంభించినట్లు తెలిసింది.
ఇప్పటి వరకు నాయకులు, ప్రజాప్రతినిధులపై విచారణ చేపట్టకపోవడం.. తాజాగా ఒకే ప్రాంతంలో.. ఒకే గ్రామంలో చేపట్టిన విచారణలోనే 11 మంది అక్రమాలు వెలుగులోకి రావడంతో అక్రమార్కుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో తమను తాము కాపాడుకునేందుకు అధికార పార్టీ నేతలను ఆశ్రయించే పనిలో పడ్డారు. అక్రమార్కులు ఎంతటి వారైనా జైలు శిక్ష తప్పదని సంబంధిత అధికారులు చెబుతున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఏ మేరకు సఫలీకృతమవుతుందోనని జిల్లా ప్రజలు వేచిచూస్తున్నారు.