- అదనపు ఆదాయం ఉన్న సీట్లపై వ్యవసాయ శాఖ ఉద్యోగుల కన్ను
- అధికార పార్టీ నేతలతో సిఫార్సులు, ఫోన్లు
- ఆదాయమే పరమావధిగా పోటాపోటీ యత్నాలు
- జేడీకి సవాలుగా మారిన సీట్ల సర్దుబాటు
కడప అగ్రికల్చర్ : వ్యవసాయ శాఖలో కుర్చీలాట మొదలైంది. అదనపు ఆదాయం లభించే సీట్లపై పలువురి దృష్టి పడింది. ఎలాగైనా సరే కీలకమైన కుర్చీలు దక్కించుకోవడానికి ఎవరంతకు వారు పావులు కదుపుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖలో ఇటీవలే బదిలీలు పూర్తయ్యాయి. అన్ని విభాగాల అధికారులు, టెక్నికల్ ఏఓలు, వివిధ సెక్షన్ల సిబ్బంది బదిలీ అయ్యారు. ఊటుకూరులోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో నాలుగు విభాగాలు ముఖ్యమైనవి.
అందులో నాణ్యత ప్రమాణాల విభాగం, యాంత్రీకరణ విభాగం, జాతీయ ఆహార భద్రత, జాతీయ నూనె గింజల ఉత్పత్తి విభాగం, విత్తన కేటాయింపులు, పంట పెట్టుబడి రాయితీ, కరువు నివేదికలు, పంటల బీమా విభాగాలను టెక్నికల్ ఏఓలు చూస్తుంటారు. భూసార సంరక్షణ, రైతు శిక్షణ కేంద్రంలోనూ టెక్నికల్ ఏఓలు ఉన్నారు. సీ-1 నుంచి సీ-8 వరకు వివిధ సెక్షన్లలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. అయితే ఆదాయం ఉన్న కుర్చీల కోసం వీరి మధ్య పోటీ మొదలైంది. కొందరు అధికార బలం, మరికొందరు డబ్బు బలం ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలానా స్థానం.. ఫలానా సెక్షన్ తాము సూచించిన వారికే ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలు జేడీపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆదాయం వచ్చే సీట్లు వారికిచ్చి ఆదాయంలేని సీట్లు మాకిస్తే ఎలా అని మరికొందరు ఉద్యోగులు జేడీ వద్ద వాదనలు వినిపించినట్లు తెలిసింది.
సెక్షన్లు మార్చండి..
‘ఎల్లకాలం మేమే ఆ సీటుకు అంకితం కావాలా.. ఇదెక్కడి న్యాయం సార్.. ఇప్పుడు సెక్షన్లలో ఉన్న వారిని ఇంకో విభాగానికి మార్చండి సార్..’ అని టెక్నికల్ ఏఓలు కొందరు జేడీపై ఒత్తిడి తెచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదాయం ఉండే సీట్ల కోసం కొందరు ఏఓలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు పోటీపడుతున్నారు. ప్రధానంగా క్వాలిటీ కంట్రోల్, ఫాం మెకనైజేషన్ విభాగాల్లో వేయించుకోవడానికి పోటీ మరీ తీవ్రంగా ఉందని సమాచారం.
ఈ తతంగాన్ని కొలిక్కి తెచ్చి విధులు అప్పగించడం నూతనంగా బాధ్యతలు చేపట్టిన జేడీకి పెద్ద సవాల్‌గా మారింది. ఈ విషయమై జిల్లా వ్యవసాయశాఖ జేడీ ఠాకూర్ నాయక్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. సెక్షన్లలో ప్రక్షాళన జరగాల్సి ఉందన్నారు. టెక్నికల్ ఏఓలలో కొందరికి పని భారం ఉందని, వారికి ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించమని చెప్పారు. ఆయా ఉద్యోగులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంపై దృష్టి సారిస్తామని చెప్పారు.
సీటు.. నోటు
Published Tue, Aug 25 2015 3:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement