సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఓ వైపు క్షేత్రస్థాయిలో ఉద్యోగుల కొరత.. మరో వైపు రైతులకు సాగులో అందని సలహాలు.. పంట చేతికందే సమయంలో తెగుళ్ల బెడద.. సకాలంలో సూచనలందక రైతుల హైరానా.. వెరసి ఈ బాధల నుంచి రైతులను విముక్తులను చేసేందుకు వ్యవసాయ శాఖ ఓ నూతన పద్ధతికి శ్రీకారం చుట్టింది. అదే ఈ వ్యవసాయం వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ ద్వారా ఔత్సాహిక, యువ రైతులు సాగు, సస్యరక్షణ మెలకువలు తెలుసుకునే అవకాశం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు సలహాలు అందించేందుకు వ్యవసాయశాఖ విస్తృతంగా కృషి చేస్తోంది. అన్ని రంగాల్లో సేవలందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. పుస్తకాలు, అధికారుల సలహాలే కాదు.. సమస్త సమాచారాన్ని రైతులు ఇంటర్నెట్ ద్వారా పొందొచ్చు. ఖరీఫ్, రబీలలో వివిధ పంటల సాగుకు సంబంధించిన సలహాలు, సూచనలను మౌస్ క్లిక్‌తో తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో అప్‌డేట్ చేస్తూ www.apagrisnet. gov.in (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఏజీఆర్‌ఐఎస్‌ఎన్‌ఈటీ.జీ వోవీ.ఐఎన్) అనే వెబ్‌సైట్ రైతు సేవకు సిద్ధంగా ఉంది.
పంటలు, అంతరపంటలపై సలహాలు..
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఅగ్రీస్‌నెట్.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్తే చాలు సమస్త సమచారం రైతులకు అందుబాటులో ఉంటుంది. సైట్ ఓపెన్ అయిన తర్వాత ‘ఈ వ్యవసాయం’ అన్న ఆప్షన్‌లో క్లిక్ చేస్తే వివిధ పంటలు, అంతర పంటల సాగుకు సంబంధించిన సలహాలు ఉంటాయి. అధిక దిగుబడి సాధించే శ్రీవరి సాగు విధానం, ప్రధాన పంటల్లో అంతర పంటలు, అదనపు దిగుబడి పొందే మార్గాలు తెలుసుకోవచ్చు. మొక్కజొన్న నుంచి కంది వరకు మెట్ట పంటల్లో యాజమాన్య పద్ధతుల్ని ఇందులో తెలుసుకోవచ్చు. సేంద్రియ విధానంలో పంటల సాగు, ఎరువుల తయారీ విధానాన్ని కూడా పొందుపరిచారు. నూతన సాగు పద్ధతులు సైతం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతుండటం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది.
చీడపీడల నివారణకు తగిన సమాచారం...
వ్యవసాయశాఖతోపాటు అనుబంధ శాఖలకు సంబంధించిన రాయితీల వివరాలు కూడా ఈ సైట్‌లో లభిస్తాయి. ప్రభుత్వ పథకాల్లో రైతులకు వర్తించే రాయితీలను ఎలా వినియోగించుకోవాలో సలహాలు పొందుపరిచారు. అన్ని ప్రభుత్వ పథకాలు, వాటి రాయితీ వివరాలు, మార్కెట్, ఎరువులు అన్ని పంటల మద్దతు ధరలు తెలుసుకోవచ్చు. మట్టి నమూనా పరీక్ష విధానం, వాటి వల్ల కలిగే లాభాలు, వ్యవసాయ పనిముట్లు ఇతర పథకాల కింద లబ్ధిపొందటానికి దరఖాస్తు చేసుకునే విధానాన్ని సైతం సూచించారు. వివిధ పంటలు చీడపీడలకు గురైన సందర్భంలో పంటను కాపాడే మిత్ర పురుగుల వివరాలు ఇందులో ఉన్నాయి. పంటల సాగు, సస్యరక్షణ చర్యలు, రాయితీల వివరాలే కాదు విత్తన విక్రయాలలో ప్రవేశ పెట్టిన విత్తన చట్టాల వివరాలను రైతులు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా పంటల సాగుకు సంబంధించి రైతులు అడిగిన ప్రశ్నలు, వాటికి నిపుణులు ఇచ్చిన సమాధానాలు తెలుసుకోవచ్చు. రైతులకున్న సందేహాలను ఈ మెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియజే సే అవకాశం ఉంది. .
వాతావరణం, ప్రాజెక్టుల నీటిమట్టంపైనా సమాచారం..
వాతావరణ వివరాలు తెలుసుకోవడంతోపాటు వాటిపై తలెత్తే సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. వర్షాధార పంటలు వేసే రైతులకు వ్యవసాయ సలహాలు, వర్షపాతం నమోదు, నెలల వారీగా చేపట్టాల్సిన వ్యవసాయ పనులపై సలహాలు ఉన్నాయి. జలాశయాలు, నీటిమట్టం, రైతుల విజయగాధలు వీడియో చిత్రాలతో సహా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ప్రభుత్వం రైతులకు ప్రవేశపెట్టిన పథకాలు, సబ్సిడీ, రుణాలు వంటి వివరాలు కూడా పొందుపరిచారు. పంటల సాగులో తలెత్తే సందేహాల నివృత్తికి ల్యాండ్‌లైన్ నుంచి 1100 లేదా 1551 టోల్ ఫ్రీ నెంబర్లకు ఉచితంగా ఫోన్ చేసి పరిష్కారం పొందొచ్చు. వ్యవసాయశాఖలో అక్కడక్కడ అధికారులు, సిబ్బంది కొరత, అందుకు తోడు చాలాచోట్ల అందుబాటులో ఉండని సందర్భాల్లో.. అసలు అధికారులే లేని చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇంటర్నెట్ ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తోంది.
అవగాహన కల్పించాలి..
ఈవ్యవసాయంపై పల్లెల్లో రైతులందరికి అవగాహాన కల్గించాలి. యువ రైతులు ఈ విధానానికి అలవాటు పడ్డారు. ఈవ్యవసాయం ద్వారా సలహాలు, సూచనలు అన్ని అందుతున్నాయి. వంగడాలు సంబంధించిన వివరాలు అందులో పొందుపరిచి ఉంటున్నాయి. తెగుళ్లు సోకిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులోనే వివరిస్తున్నారు. ఈవిధానం రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుంది. రైతులందరికి ఈ విధానాన్ని అలవాటు చేయాలి.
- లక్ష్మణ్, కల్లూరు కుంటాల మండలం
ఈ వ్యవసాయం
Published Mon, Aug 26 2013 4:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement