కోనరావుపేట(వేములవాడ): ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దులోని వెంకటాపురం వద్ద ఈ నెల 10న జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని, నిద్రిస్తున్న వారిపై ఒక్కసారిగా పోలీసులు కాల్పులు జరిపారని సీపీఐ (ఎంఎల్) జనశక్తి రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఈ హత్యలు చేయించిందని మండిపడ్డారు. తెలంగాణ సాధనకు విప్లవ పార్టీలు ఎంతగానో కష్టపడ్డాయని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సాక్షి కార్యాలయానికి ఒక లేఖ పంపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇందుకోసం విద్యార్థులు బలిదానాలు చేశారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో దొరలు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దొరలు పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. వెంకటాపురం సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. జనశక్తి వ్యవస్థాపకుడు కూర రాజన్న అనారోగ్యంతో బాధ పడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment