3వ స్టేజ్‌ ఇంకా రాలేదు | Sakshi Interview with Pulmonologist Dr Harikrishna | Sakshi
Sakshi News home page

3వ స్టేజ్‌ ఇంకా రాలేదు

Published Thu, Apr 9 2020 2:12 AM | Last Updated on Thu, Apr 9 2020 2:12 AM

Sakshi Interview with Pulmonologist Dr Harikrishna

సాక్షి, హైదరాబాద్‌: మనదేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా మూడో దశకు చేరుకుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి చీఫ్‌ ఇంటర్‌వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ డా.హరికిషన్‌ తెలిపారు. భారతీయులతో పాటు ఆఫ్రికా దేశాల ప్రజలు కరోనా వైరస్‌ను తట్టుకోగలిగే శక్తి, నిరోధకత ఎక్కువగా ఉంటుందన్న భావన ఊహాజనితమైనదే తప్ప శాస్త్రీయంగా, ప్రయోగాత్మకంగా నిరూపితం కాలేదని స్పష్టం చేశారు. మన దేశంలో మధ్య వయస్కులు, యువత శాతం ఎక్కువగా ఉండటం, ఇటలీ ఇతర పశ్చిమ దేశాల్లో వయసు మీరిన వారి శాతం ఎక్కువగా ఉండటమనేది ఈ వైరస్‌ బారిన పడుతున్న సంఖ్యతో పాటు అక్కడ మరణాలు ఎక్కువ కావడానికి కారణమవుతోందన్నారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా రోడ్లపైకి ఎక్కువగా వచ్చి కలియ తిరుగుతున్న మధ్య వయస్కులు, ముఖ్యంగా యువకులకు ఈ వైరస్‌ సోకితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బయటపడినా, వారి ఇళ్లలోని పెద్దవాళ్లు, డయాబెటిస్, ఇతరత్రా బలహీనంగా ఉన్న వారికి వీరి నుంచి వైరస్‌ వ్యాపిస్తే పెను సమస్యగా మారుతుందని హెచ్చరించారు. అందువల్ల ఇళ్లలోని పెద్దవారి ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని గురించి ఆలోచించి బయట తిరగడం తగ్గించాలని సూచించారు. ఇంకా కొన్ని రోజులు అందరూ ఇళ్లకే పరిమితమై, ఇళ్లు, సమూహాల్లో వ్యక్తుల మధ్య దూరాన్ని కచ్చితంగా పాటించడం (ఆరడుగుల దూరం), షేక్‌హ్యాండ్‌లు ఇవ్వకపోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా మాత్రమే ఈ వైరస్‌ మరింత విస్తరించకుండా బలహీనపరిచేందుకు అవకాశముందని స్పష్టం చేశారు.   ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..

ప్రస్తుత పరిస్థితిపై..
దేశవ్యాప్తంగా సరైన టైమ్‌కే లాక్‌డౌన్‌ ప్రకటించారు. మిగతా దేశాలతో పోల్చితే పాజిటివ్‌ పేషెంట్ల సంఖ్య పెరుగుదల ఎక్కువగా లేకపోవడం, పాజిటివ్‌ కేసుల్లోనూ తీవ్రంగా ప్రభావితమై, మరణాలు సంభవిస్తున్న కేసులు కూడా తక్కువగా ఉండడం మనకు కలిసొచ్చే అంశం.

మూడో స్టేజ్‌లోకి వచ్చామా?
అలా కనబడట్లేదు. ముందుగా విదేశాల నుంచి వచ్చిన వారికి, వారి నుంచి సన్నిహితులు, అక్కడి నుంచి కమ్యూనిటీ ఇన్ఫెక్షన్లకు దారి తీయడాన్ని థర్డ్‌ స్టేజ్‌గా పరిగణిస్తారు. ఇప్పటికీ మనకా పరిస్థితి రాలేదు. అమెరికా, ఇటలీ, స్పెయిన్, తదితర దేశాల కంటే భిన్నమైన స్థితిలో ఉన్నాం.

రోగులను ఎలా ట్రీట్‌ చేశారు?
ఇద్దరు కోవిడ్‌ రోగులకు మేం చికిత్స చేశాం. వారిప్పుడు కోలుకున్నారు. కచ్చితమైన క్వారంటైన్, ఐసోలేషన్‌ను పాటించడంతో పాటు వైరస్‌ ప్రభావాన్ని తగ్గిచేందుకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చాం.

వ్యాక్సిన్, మందులు రావడానికి...
ఈ వైరస్‌కు విరుగుడు కనుక్కునేందుకు క్లినికల్‌ టెస్ట్‌లు నిర్వహించి వివిధ దశలు దాటి వ్యాక్సిన్‌ తయారయ్యేందుకు మరో ఏడాది, ఏడాదిన్నర సమయం పడుతుంది. వ్యాక్సిన్‌ కాకుండా కంట్రోల్‌ ట్రయల్స్‌కు ఆరేడు నెలల సమయం పడుతుంది.

హాంకాంగ్, సింగపూర్‌ల అనుభవాలేంటి?
కరోనా కేసులతో డీల్‌ చేస్తున్న సింగపూర్, హాంకాంగ్‌లోని వైద్యులతో టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడాం. వాళ్లు అనుసరిస్తున్న చికిత్స పద్ధతులు, వాడుతున్న మందులు, ఇతర అనుభవాల గురించి తెలుసుకున్నాం. సింగపూర్‌లో లాక్‌డౌన్‌ కచ్చితంగా పాటించడంతో పాటు పాజిటివ్‌ కేసుల గుర్తింపు, వారు ఎవరెవరిని కలిశారో, వారు ఎక్కడెక్కడున్నారో ట్రాక్‌ చేసి నియంత్రించి విజయం సాధించారు.

మనదేశంలో, రాష్ట్రంలో పరిస్థితేంటి?
లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ అమలవు తున్న తీరు గ్రేట్‌. చాలా వరకు మంచి ఫలితాలనే సాధించాం. ఈ వ్యాధికి ట్రీట్‌మెంట్‌ లేదు. నివారణ ఒక్కటే మార్గం అన్నది అందరూ తెలుసుకోవాలి.

చైనా అనుభవాలు పనికొస్తున్నాయా?
చైనాలో కరోనా సోకిన వారి కోసం విడిగా ఆసుపత్రులు పెట్టి, రోగులను వివిధ బృందాల కింద విడగొట్టి చికిత్స అందించడంతో పాటు వైరస్‌ నివారణకు లేదా అదుపులోకి తెచ్చేందుకు ఉపయో గించే మందులపై స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. పేషెంట్లపై నిర్వహించిన పరీక్షలతో పాటు ఈ వ్యాధి లక్షణాలు, వైరస్‌ వ్యాప్తికి కారణాలు ఇతరత్రా అంశాలపై నిర్వహించిన పరిశోధనలతో చైనా వైద్యులు అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురించిన వ్యాసాలు ప్రస్తుతం మనతో పాటు వివిధ దేశాల్లో చికిత్సకు, అవగాహనకు, సమాచారానికి ఉపయోగపడుతున్నాయి. 

వైరస్‌ తీవ్రత తక్కువగా ఉందా?
అలాంటిదేమీ లేదు.
మిగతా దేశాలతో పోల్చితే ఇక్కడ తీవ్రత బలహీనంగా ఉందనేది నిరూపితం కాలేదు. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ ఒకరిద్దరికి సోకితే, వైరస్‌ వ్యాప్తి చెందే వేరియబుల్‌ (ఆర్‌ జీరో) ముందు ఒకరి నుంచి 2, 2.5 మందికి వ్యాప్తి చెందుతుందని తొలుత భావించినా, ఇప్పుడు ఇది 4 నుంచి 4.5 మందికి వ్యాప్తి చెందేదిగా మారింది. దీన్నే ఆర్‌–నాట్‌గా పరిగణిస్తున్నాం. ఇది నలుగురి నుంచి ఐదుగురికి, వారి నుంచి మరికొందరికి వ్యాపించే అవకాశాలున్నాయి.

పాజిటివ్‌లను త్వరితంగా గుర్తించొచ్చా?
పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ టెస్టింగ్‌ ద్వారా ఐజీజీ, ఐజీఎం పద్ధతుల ద్వారా డయాబెటిస్‌కు ఒక స్ట్రిప్‌ ద్వారా బ్లడ్‌ ఫ్రీక్వెన్సీ టెస్ట్‌తో తక్కువ సమయంలోనే గుర్తించే అవకాశముంది. ఈ వైరస్‌ బారిన పడ్డారా లేదా అని తెలుసుకునేందుకు ఆర్‌టీ–పీసీఆర్‌ (రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌) టెక్నిక్‌ న్యూక్లిక్‌ యాసిడ్‌ డిటెక్షన్‌ టెస్ట్‌లో దూదితో ముక్కులోంచి నమూనా సేకరించడం ద్వారా 85 శాతం కచ్చితంగా నిర్ధారించొచ్చు. పీసీఆర్‌లో నెగెటివ్‌ వచ్చే 15 శాతంలో మళ్లీ ఎక్కువ జ్వరంతో లక్షణాలు బయటపడతాయి. ఫాల్స్‌ నెగెటివ్‌ వచ్చిన వారికి రిపీట్‌ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించడం ద్వారా వారిలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయో లేదో నిర్ధారించొచ్చు. కమ్యూనిటీ స్ప్రెడ్‌ను మాత్రం 6, 7 రోజుల తర్వాతే గుర్తించే వీలుంటుంది. ఇది కాకుండా పాజిటివ్‌ నుంచి కాంటాక్ట్‌ అయిన వారికి ఈ వైరస్‌ లక్షణాలు 8 రోజుల్లో బయటపడతాయి. ఆ తర్వాత 102 డిగ్రీలు జ్వరం తగ్గకుండా వస్తుంది. అలాంటి వారిని ఐసోలేషన్‌లో ఉంచి తగిన చికిత్స అందిస్తే సరిపోతుంది. 

ఉష్ణోగ్రతలు పెరిగితే తగ్గుతుందా
ఉష్ణోగ్రతలు పెరగడం తప్పకుండా సానుకూల ప్రభావం చూపనుంది. వేసవితాపం పెరగడం, 20 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలుంటే వైరస్‌ తీవ్రత తగ్గేందుకు అవకాశం ఉంది. చైనాలోనూ టెంపరేచర్‌ పెరగడం వల్ల దీని తీవ్రత తగ్గిందనే వాదనా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement