సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు ప్రతినిత్యం సాక్షి దినపత్రిక అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న 24 మెట్రో కేంద్రాలలో ప్రయాణికుల కోసం ఇకనుంచి ప్రతిరోజూ సాక్షి దినపత్రిక అందుబాటులో ఉంచే కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఏర్పాటుచేసిన తొలి "సాక్షి స్టాల్"ను ఆయన ప్రారంభించారు.
బుధవారం నుంచి అన్ని మెట్రో కేంద్రాల్లో సాక్షి దినపత్రిక ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అందుకోసం మెట్రో స్టేషన్లలోని ఫ్లాట్‌ఫామ్స్‌కు ఇరువైపుల సాక్షి స్టాల్స్ ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న వేలాదిమందికి సాక్షి దినపత్రికను అందుబాటులో తేవడం శుభపరిణామమని ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి అభినందించారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ప్రారంభమైన తొలి స్టాల్ నుంచి సాక్షి అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి చేతుల మీదుగా ‘సాక్షి’ ప్రతిని అందుకుని ఈ సరికొత్త ప్రయోగానికి ఎన్వీఎస్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి, డైరెక్టర్ కార్పొరేట్ అఫేర్స్ రాణిరెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ వై ఈశ్వరప్రసాద రెడ్డి, అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కమల్ కిషోర్ రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రతినిధి సారికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment