సాక్షి, పెద్దపల్లి: ఎవరైనా వాయిదా పద్దతిన వాహనాలు కొనుగోలు చేస్తే.. తీసుకున్న నెల నుంచి చెల్లింపులు మొదలవుతాయి. ఇది సాధారణం. కానీ అసలు వాహనమే లేకుండా నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల విచిత్ర వ్యవహారం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకొంది. ప్రభు త్వం రాయితీపై ఇస్తున్న ద్విచక్రవాహనాలు పొందకుండానే, 3 నెలలుగా ఏఎన్‌ఎంల జీతం నుంచి వాయిదాలు కట్ అవడం చర్చనీయాంశమైంది.
రాయితీపై ద్విచక్రవాహనాలు: పల్లెల్లో వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏఎన్‌ఎంలకు రాయితీతో కూడిన, సులభ వాయిదా పద్ధతిలో చెల్లించేలా ద్విచక్రవాహన సౌకర్యం కల్పించాలని గతంలో నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న ఏఎన్‌ఎంలకు రూ.15 వేలు సబ్సిడీ ఇస్తారు. మిగతా మొత్తాన్ని సంబంధిత ఏఎన్‌ఎంల జీతం నుంచి సులభ వాయిదా పద్దతిలో నెలవారీగా కట్ చేసుకుంటారు.
మూడు నెలలుగా జీతంలో కోత
పెద్దపల్లి జిల్లాలో ఏఎన్‌ఎంలను ఎంపిక చేసినా.. ఇప్పటి వరకు ద్విచక్రవాహనాల పంపిణీ మొదలు కాలేదు. ద్విచక్రవాహనాలను ఇవ్వకున్నా ఎంపికైన ఏఎన్‌ఎంల జీతం నుంచి మాత్రం ఇన్‌స్టాల్‌మెంట్ పేరిట కట్ చేస్తున్నారు. గత మే నుంచి జూలై వర కు 3 నెలలు జిల్లాలోని ఏఎన్‌ఎంల జీతాల నుంచి కోత విధించారు. ఇన్‌స్టాల్‌మెంట్‌ను మినహాయిం చుకొని ఏఎన్‌ఎంల జీతాలు బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఏఎన్‌ఎంలు, రెండో ఏఎన్‌ఎంలు 148 మంది ద్విచక్రవాహనాలకు దర ఖాస్తు చేసుకొన్నారు. ఇందులో మొదటి దశలో 86 మందికి ద్విచక్రవాహనాలు మంజూరయ్యాయి. ప్రభుత్వ పరంగా మంజూరైన సబ్సీడీ రూ.10 వేలు కూడా ఆయా షోరూంల్లో చెల్లించారు. బ్యాంక్ ప్రక్రియనూ పూర్తి చేసుకొన్నారు. దీంతో వీళ్లకు వాహనాలు అందకపోయినా, నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్ మాత్రం కోతపడుతోంది.
నాలుగు రోజుల్లో పంపిణీ
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలందించేందుకు ఏఎన్‌ఎం, రెండో ఏఎన్ ఎంలకు ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. 3 మాసాల క్రితమే ఆ వాహనాలు షోరూంకు సైతం చేరుకున్నాయి. మరో 4 రోజుల్లో ఏఎన్‌ఎంలకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేశారు. ఇన్‌స్టాల్‌మెంట్ కట్ అవుతున్నది వాస్తవమే, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తా. - ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment