తహసీల్దార్‌కు వినతిపత్రమిస్తున్న యువకులు
ఇందల్‌వాయి : మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులోని వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకున్న తమను మండలానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడొకరు దూషించినట్లు శివగణేష్ యూత్ సభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇసుకను అక్రమంగా తరలించుకు పోవడానికి కొందరు మంగళవారం అర్ధరాత్రి ఐదు ట్రాక్టర్లతో లింగపూర్ వాగులోకి వచ్చారని తెలిపారు. అది గమనించిన తాము ఇసుక తరలింపును అడ్డగిస్తే వారు దాడికి దిగి, తమకు అడ్డొస్తే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తామని బెదిరించినట్లు లింగాపూర్ యువకులు నరేశ్, రవి, సంతోష్ తదితరులు తెలిపారు. దీంతో తాము గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు వచ్చి రెండు ట్రాక్టర్లను పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారన్నారు.
కందకాలు పూడ్చి మరీ అక్రమ రవాణ
ఇసుక అక్రమ రవాణాకు అడుకట్ట వేసేందుకు నెల రోజుల క్రితం వాగులోకి ట్రాక్టర్లు, టిప్పర్లు వెళ్లకుండా తహసీల్దార్ సమక్షంలో కందకాలు తవ్వించారు. అయితే, ఇసుకాసురులు ఆ కందకాలను పూడ్చి మరీ ఇసుకను అక్రమంగా తరలించుకు పోతున్నారని, ప్రకృతితో పాటు, రైతులకు తీవ్రనష్టం చేస్తున్నారని లింగాపూర్ యువకులు తెలిపారు. ఇలాంటి దుండగులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్, గౌరారం సర్పంచ్ ఇమ్మడి లక్ష్మికి వినతిపత్రం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment