
మసక చీకటిలో ఇసుక దోపిడీ
సిద్దిపేట రూరల్/చిన్నకోడూరు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీచ్‌ల నుంచి తరలించే ఇసుక రవాణాలో నిబంధనలకు పాతరేస్తున్నారు. పక్కా ప్రణాళికలతో కీలక వ్యక్తులను మేనేజ్ చేస్తూ తమ దందాను సాగిస్తున్నారు. ఒకే బిల్లును కనీసం మూడు లారీలకు వినియోగిస్తున్నారు. టన్నుకు సుమారు రూ.350 చొప్పున చెల్లించే రుసుముతో మీసేవలో ఓ అధికారిక పత్రాన్ని తీసుకుంటూ ఇతర లోడ్‌లకు గాను టన్నుకు రూ.100 చొప్పున ఇచ్చి సిబ్బందిని లోబర్చుకుంటున్నారు. ఒక్కో లారీకి గరిష్టంగా 15 టన్నులు భర్తీ చేయాల్సి ఉంటే 45 టన్నుల వరకు నింపుతున్నారు. ఇలా అన్ని విధాలుగా ధగా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ నిర్వాకాన్ని సంబంధిత శాఖల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పైఅధికారి చాలా స్ట్రిక్ట్ అంటూ రెండు, మూడింతల మామూళ్లు పిండుతున్నారు. కరీంనగర్, సిరిసిల్ల మధ్య ఉన్న ఖాజీపూర్ ఇసుక పాయింట్ నుంచి సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌కు రోజూ రాత్రి వేళల్లో 100 నుంచి 150 లారీల్లో ఇసుక రవాణా అవుతుంది. తద్వారా ఒక్కో రాత్రికి లక్షల రూపాయలను దండుకుంటున్నారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా మారింది వ్యవహారం. ముఖ్యంగా మూడు దశల్లోని అధికారులు, ఇతరులు దండిగా నొక్కేస్తున్నారు.
సిద్దిపేట ప్రాంతంతోపాటు హైదరాబాద్‌లో పలు నిర్మాణాలకు ఇసుక తప్పనిసరి అవసరం. ఇందుకు గాను ఇసుకను తరలించడానికి గనుల శాఖ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. నిర్ణీత వాగుల నుంచి పరిమితంగా ఇసుకను వే బిల్లుపై తరలించడానికి అవకాశమిచ్చింది. ఈ అవకాశాన్ని ఇసుక మాఫియా దుర్వినియోగపరుస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇసుకను అక్రమంగా తరలిస్తోంది. సదరు వ్యక్తులు ప్రధానంగా కరీంనగర్ జిల్లా ఖాజీపూర్, సిరిసిల్ల వాగుల నుంచి ఇసుకను రాజీవ్ రహదారి మీదుగా లారీల్లో తరలిస్తున్నారు.
ఒక వాగు నుంచి ఒక రోజుకు అనుమతించిన ఇసుక కన్నా నాలుగైదు రెట్లు అధికంగా తోడుతూ హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. ఈ మార్గమంతా రాజీవ్ రహదారే. ఇందులో ప్రధాన కేంద్రం సిద్దిపేట. దీంతో ఇక్కడి అధికారులకు మామూళ్లు చెల్లిస్తూ తమ అక్రమ దందాను సాగిస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఒక నంబర్ గల లారీ ఒక రోజు ఒక ట్రిప్పును రవాణా చేయాల్సి ఉండగా వేగంగా తోలుతూ రోజుకు రెండు, మూడు ట్రిప్పులను ఒకే లారీని నడిపిస్తున్నారు.
రిపేర్ పేరిట మోసం...
ఇసుకను రవాణా చేయడానికి అనుమతి పొందిన లారీ తన రవాణాను కొనసాగిస్తుండగానే ఈ లారీ రిపేర్‌లో ఉన్నట్లు దరఖాస్తు చేసుకొని మరో లారీ ద్వారా ఇసుకను రవాణా చేయడానికి అనుమతి పొందుతున్నారు. దీన్ని సాకుగా చూపి అక్రమ దందాను మరింత వేగం చేస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినప్పటికీ సదరు వ్యక్తులు సిద్దిపేట ప్రాంత అధికారులతో రహస్య ఒప్పందాలు చేసుకుంటూ అక్రమ దందా జోరును పెంచేస్తున్నారు.
అనుమతి 15 టన్నులు.. రవాణా 45 టన్నులు...
15 టన్నుల ఇసుకను రవాణా చేయడానికి అనుమతి పొందిన లారీలో సుమారు 45 టన్నుల వరకు ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఇలా రవాణా చేయడం వల్ల లారీపై ఉండే కూలీలు కింద జారిపడి ప్రమాదాల బారిన సంఘటనలు చాలానే ఉన్నాయి. దీంతోపాటు కనీసం కవర్లు కూడా కప్పకపోవడంతో గాలి వేగానికి లారీపై ఉన్న ఇసుక వెనుక ప్రయాణిస్తున్న వాహనాలపై పడడం.. వెనకున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురి ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోయాయి.
అనుమతి ఒకటి... అక్రమాలు పన్నెండు...
ఇసుక మాఫియా ఒక రోజుకు 15 టన్నుల లారీ అనుమతి పొంది 45 టన్నుల ఇసుకను తరలిస్తోంది. దీంతోపాటు ఒక ట్రిప్పుకు బదులుగా మూడు ట్రిప్పులు తరలిస్తోంది. అనుమతి పత్రాలు ఒకటి ఉంటే వాటి పేర్లతోనే మరో మూడు, నాలుగు ఇసుక లారీలను పంపుతోంది.
పోలీసులకు రూ.లక్షల్లో మామూళ్లు...
సిద్దిపేట ప్రాంతంలోని రాజీవ్ రహదారిపై ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక్కో లారీకి రోజుకు రూ.5 వేల చొప్పున మామూళ్లను పోలీసులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి లారీలు రోజుకు సుమారు వందకుపైగా ఉంటాయి. అప్పుడప్పుడు మొక్కుబడిగా లారీలను అడ్డుకుని జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. రెవెన్యూ అధికారులు సైతం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. కొందరు అధికారులు డబ్బులు ముట్టుకోకుండా ఇసుకను వినియోగించుకుంటున్నారని సమాచారం. ఇటీవల జిల్లాకు స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చారని ప్రచారం చేస్తూ తమ మామూళ్లను ఏకంగా మూడంతలు పెంచుకున్నట్టు సమాచారం. మామూళ్లు ఇవ్వలేక ఈ దందానే మానుకున్నట్టు కొందరు వ్యాపారులు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.