
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామాల్లో మూడో ఫేజ్ విద్యుత్ కనెన్షన్లు, మరింత మెరుగైన గురుకుల విద్యా సౌకర్యాలు తదితర అంశాలకు వచ్చే బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. సోమవారం డీఎస్‌ఎస్ భవన్‌లో జరిగిన ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశంలో గిరిజనుల జనాభా దామాషా ప్రకారం కేటాయించిన నిధులను ఆయా శాఖల్లో ఏ మేరకు ఖర్చు చేస్తున్నాయన్న అంశంపై ఎస్టీ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం సత్యవతి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక నిధి కింద గత బడ్జెట్‌లో ఎస్టీలకు రూ.7,184 కోట్లు కేటాయిస్తే.. సుమారు రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని, మిగతావి ఈ ఏడాది లోపు ఖర్చు చేయాలని ఆదేశించామన్నారు. ఈ నెల 6 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో గిరిజన సంక్షేమానికి ఎక్కువ నిధులు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.