సింగరేణిలో ఎన్నికల నగారా
► అక్టోబర్ 5న గుర్తింపు
► కార్మిక సంఘం ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 5న సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరగను న్నాయి. సింగరేణి భవన్‌లో సోమవారం కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశం లో కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్), రిటర్నింగ్ అధికారి కె.కె.హెచ్.ఎం శ్యామ్‌సుందర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. దీని ప్రకారం... అక్టోబర్ 5 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
ఈ నెల 30లోగా సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలకు ముసా యిదా ఓటర్ల జాబితాను అందజేయనుంది. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 6 సాయంత్రం 5 గంటలలోగా కార్మిక సంఘాలు రిటర్నింగ్ అధికారికి తెలపాలి. అభ్యంతారాలపై సెప్టెంబర్ 9న సాయంత్రం 5 గంటలలోగా రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. సెప్టెంబర్ 13న తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. 14న ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల తో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. 19న మధ్యాహ్నం 2 గంటలతో నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగియనుంది.
20 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకూ నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. 20న మధ్యాహ్నం 2 గంటలలోపు అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించి అదేరోజు రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఆగస్టు 1 నాటికి హాజరు పట్టీలో ఉన్న ఉద్యోగులను తాత్కా లిక ఓటర్లుగా గుర్తిస్తామని, అయితే అక్టోబర్ 5 నాటికి హాజరు పట్టీలో ఉన్న ఉద్యోగులు మాత్రమే ఓటు వేయడానికి అర్హులని సింగరేణి యాజమాన్యం తెలిపింది. ఈ మధ్యకాలంలో రిటైరైన ఉద్యోగులు ఓటు వేయడానికి అనర్హులని పేర్కొంది.