హైదరాబాద్ :
సింగరేణి వ్యాప్తంగా గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వినియెగించుకోవడం కోసం కార్మికులు బారులు తీరారు. దక్షిణ భారతదేశానికే తలమానికంగా తెలంగాణ కొంగు బంగారంగా.. విరాజిల్లుతోన్న సింగరేణి బొగ్గుగనుల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. కోలిండియా విస్తరించి ఉన్న ఏ బొగ్గు కంపెనీలో కూడా గుర్తింపుకార్మిక సంఘం ఎన్నికలు లేవు. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో సైతం అందరి దృష్టి ఈ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపైనే కేంద్రీకృతమైంది.
ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రతి ఓటరు/ఉద్యోగి తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డు (శాశ్వత/తాత్కాలిక)ను వెంటతీసుకొని రావాలని యాజమాన్యం కోరింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సింగరేణి సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఆరు జిల్లాల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికల నిర్వహణకు పోలీస్, కౌంటింగ్ సిబ్బంది, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందిని నియమించారు. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ ప్రక్రియను కేంద్ర కార్మిక శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు నియమించిన ఆర్డీవో స్థాయి అధికారులు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు విధుల్లో పాల్గొంటున్నారని సింగరేణి యాజమాన్యం తెలిపింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్, విపక్ష పార్టీలు సీపీఐ, కాంగ్రెస్‌ల అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీల కూటమి ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. టీడీపీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్‌టీయూసీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీల కూటమికి మద్దతిస్తోంది.
కొత్తగూడెం కార్పొరేట్‌పరిధిలో (హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌తో కలిపి) ఐదు పోలింగ్ కేంద్రాలు.. మొత్తం ఓటర్లు 1475(సింగరేణి భవన్‌లోని పోలింగ్ కేంద్రంలో 86 ఓట్లు), కొత్తగూడెం ఏరియాలో ఏడుపోలింగ్ కేంద్రాలు (సత్తుపల్లితో సహా )... మొత్తం ఓటర్లు 3,712, ఇల్లెందు ఏరియాలో ఆరు పోలింగ్ కేంద్రాలు ... 1112 మంది ఓటర్లు, మణుగూరు ఏరియాలో ఆరు పోలింగ్ కేంద్రాలు .. 2883 మంది ఓటర్లు, రామగుండం-1 ఏరియాలో (ఏఆర్‌వో1)ఆరు పోలింగ్ కేంద్రాలు... 3881 మంది ఓటర్లు, రామగుండం-1 ఏరియాలో (ఏఆర్‌వో2) ఏడుపోలింగ్ కేంద్రాలు... 2995 మంది ఓటర్లు. రామగుండం-2 ఏరియాలో ఆరు పోలింగ్ కేంద్రాలు... 4221 మంది ఓటర్లు, రామగుండం-3 ఏరియాలో ఏడు పోలింగ్ కేంద్రాలు... 5367 మంది ఓటర్లు, భూపాలపల్లి ఏరియాలో 9 పోలింగ్ కేంద్రాలు... 6854 మంది ఓటర్లు, బెల్లంపల్లి ఏరియాలో ఐదు పోలింగ్ కేంద్రాలు... 1743 మంది ఓటర్లు, మందమర్రి ఏరియాలో 13 పోలింగ్ కేంద్రాలు... 6429 మంది ఓటర్లు, శ్రీరాంపూర్ ఏరియా (ఏఆర్‌వో1) పరిధిలో 8 పోలింగ్ కేంద్రాలు.. 5956 మంది ఓటర్లు, శ్రీరాంపూర్ ఏరియా (ఎఆర్‌వో-2) పరిధిలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు... 5906 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment