తల్లి మందలించిందని ఉరేసుకున్నాడు!
కోల్‌సిటీ (కరీంనగర్) : తల్లి మందలించిందని మనస్తాపం చెందిన ఓ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని వినోభానగర్‌లో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలోని మానకొండూరు మండలం తిమ్మాపూర్‌కు చెందిన ప్రశాంత్ ఇటీవలే 9వ తరగతి పూర్తిచేసుకున్నాడు. వేసవి సెలవులు కావడంతో వారం రోజులు గోదావరిఖనిలోని పెద్దనాన్న ఇంట్లో గడిపి వస్తానని వెళ్లాడు. అయితే వారం రోజులు దాటినా రాకపోయే సరికి ప్రశాంత్ తల్లి సరోజ శనివారం ఉదయం గోదావరిఖనికి వచ్చింది.
పదో తరగతికి ముందస్తు శిక్షణ ప్రారంభం కాగా.. తోటి విద్యార్థులందరూ వెళుతున్నారు, నువ్వు ఇక్కడే ఎందుకు ఉండిపోయావంటూ కుమారుడిని మందలించింది. దీంతో ప్రశాంత్ మనస్తాపం చెందాడు. చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్న అతడు ఆయింట్‌మెంట్ రాసుకుంటానని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని చీరతో ఉరేసుకున్నాడు. ఎంతసేపటికీ ప్రశాంత్ బయటకు రాకపోవడంతో తల్లి కిటీకీలోంచి చూడగా దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీంతో సరోజ లబోదిబోమంటూ కన్నీరుపెట్టింది. స్థానికులు వచ్చి ప్రశాంత్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.