ఉగ్రవాది అవ్వాలనుకున్నాడు.. అయ్యాడు
లండన్: అతడి పేరు తలా అస్మాల్. వయసు పదిహేడేళ్లు. బ్రిటన్ లోని యార్క్ షైర్ ప్రాంతవాసి అయిన అతడు రోజుగా బుద్ధిగా వెళ్లి పాఠాలు వల్లే వేసేవాడు. ఎప్పుడూ ఇళ్లు వదిలి వెళ్లేవాడు కాదు. స్నేహితులు, రోడ్లపై కార్లతో షికార్లు కూడా లేవు. అయితే, అతడి జీవితంలో జరిగిన చిన్న సంఘటన మొత్తం జీవిత చిత్రాన్నే మార్చేసేంది. స్కూల్ పరీక్షల్లో తప్పడంతో సిగ్గుతో ఇంటికి వెళ్లలేక చేయకూడని ఆలోచన చేశాడు. తాను ఉగ్రవాదినవ్వాలనుకున్నాడు. అనుకుందే తడవుగా సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరాడు. ఆ వెంటనే శిక్షణ పొంది ఇరాక్ సమీపంలోని బైజీ పట్టణంపై బాంబు దాడులు చేశాడు.
అప్పటి నుంచే ఐఎస్ ఉగ్రవాదులు అస్మాల్ తో దాడులు చేయించడం.. ఈ దాడులు చేసింది మావాడే అని అస్మాల్ ఫొటోలు అన్ని రకాల వెబ్ సైట్లలో పెట్టడం పరిపాటయింది. వీటిని చూసి అస్మాల్ కుటుంబ సభ్యులు పడిన నరకం అంతా ఇంతా కాదు. అయితే, చివరికి అస్మాల్ జీవితం విషాదంగానే ముగిసింది. గత శనివారం అతడు ఓ దారుణానికి తెగబడ్డాడు. మానవ బాంబుగా తయారై ఇరాక్ భద్రతా సిబ్బంది కార్యాలయంపై ఓ పెద్ద కారులో బాంబులో నింపుకుని వెళ్లి తనను తాను పేల్చేసుకుని జీవితాన్ని ముగించాడు. ఇలా, తన మాతృదేశం నుంచి పదిహేడేళ్లకే ఆత్మాహుతి దాడికి పాల్పడిన యువకుడిగా నిలిచాడు. అయితే, తమ కుమారుడు చనిపోలేదని, ఇస్లామిక్ స్టేట్ ప్రచురించిన ఫొటోల్లో గడ్డంతో ఉన్న యువకుడు తమ బిడ్డలాగే ఉన్నాడని అన్నారు.