
130 మంది విద్యార్థులను ఇష్టానుసారంగా చితకబాదాడు
సాక్షి, నాగర్ కర్నూలు: జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలోని కేకే రెడ్డి స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. క్రమశిక్షణ పేరుతో స్కూల్ వార్డెన్ విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు. వివరాల్లోకి వెళితే.. కేకే రెడ్డి స్కూల్‌లో వార్డెన్‌గా పనిచేస్తున్న రవీందర్.. బాత్రూమ్‌లో నీళ్లు పోయలేదన్న కోపంతో 130 మంది విద్యార్థులను ఇష్టానుసారంగా చితకబాదాడు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలు కావడంతో వారిని నాగర్ కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసిన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం వార్డెన్ రవీందర్ పరారీలో ఉన్నారు.