సాక్షి, సంగారెడ్డి: రాష్ట్ర సచివాలయంలో రేగిన ‘స్థానికత చిచ్చు’ జిల్లాకు పాకింది. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేందుకు వీలులేదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు జిల్లాలో ఎంతమంది స్థానికేతర ఉద్యోగులున్నారన్న అంశంపై ఉద్యోగ సంఘాలు ఆరా తీస్తున్నాయి. జిల్లాలోని 68 ప్రభుత్వ శాఖలున్నాయి. విద్యా శాఖ మినహాయిస్తే మిగిలిన శాఖల్లో మొత్తం 36,818 మంది ఉద్యోగులు గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 స్థాయిల్లో పనిచేస్తున్నారు.
వీరిలో సుమారు 8 శాతం మంది స్థానికేతర ఉద్యోగులేనని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే గుర్తించాయి. టీఎన్జీవో జిల్లా విభాగం శాఖల వారీగా స్థానికేతర ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసింది. ఈ జాబితాలకు తుది మెరుగులు ఇచ్చే పనిలో ఉద్యోగ నేతలు నిమగ్నమై ఉన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శాఖల వారీగా స్థానికేతర ఉద్యోగుల జాబితాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈపరిణామాలు ఉద్యోగ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కలెక్టరేట్ భవన సముదాయంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 62 మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో జిల్లాస్థాయి అధికారులతో పాటు ఆఫీస్ సబార్డినేట్(అటెండర్) స్థాయి వరకు పనిచేస్తున్న వారున్నారు.
విద్య, వైద్య శాఖలపై ప్రత్యేక దృష్టి
జిల్లా విద్యా, వైద్య శాఖల్లో పనిచేస్తున్న స్థానికేతర ఉద్యోగులపై ఉద్యోగ సంఘాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇతర శాఖలతో పోలిస్తే ఈ రెండు శాఖలో స్థానికేతర ఉద్యోగుల ప్రాతినిధ్యం అధిక సంఖ్యలో ఉన్నట్లు టీఎన్జీవోలు పేర్కొంటున్నారు.
జిల్లా విద్యాశాఖలో 13,200 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో 20 శాతానికి పైగా స్థానికేతరులున్నట్లు ఉద్యోగ సంఘాలు లెక్కలేశాయి. ఇక వైద్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌డబ్ల్యూఓల్లో సైతం గణనీయ సంఖ్యలో నాన్ లోకల్స్ ఉన్నారని భావిస్తున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ సమయంలో 20 శాతం ఓపెన్ కేటగిరీ కోటాకు మించి స్థానికేతర అభ్యర్థులకు అవకాశం కల్పించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఉద్యోగుల ప్రాంతీయతను గుర్తించేందుకు వారి ‘పుట్టు’ పూర్వోత్తరాలు, విద్యాభ్యాసం జరిపిన ప్రాంతాల సమాచారాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కూపీ లాగుతున్నారు. రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్, పోచారం ప్రాంతాల్లో నివాసముంటున్న ఉద్యోగుల్లో కొందరు నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించారని ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం.
కొందరు ఉద్యోగులు దిక్కుమొక్కు లేని పాఠశాలల్లో చదివినట్లు నకిలీ బోనఫైడ్ పత్రాలు సృష్టించారని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు.
ఆ పాఠశాలలన్నీ బోగస్ అని నిర్ధారించడానికి .. జిల్లాలో గుర్తింపు కలిగిన పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించాలని జిల్లా విద్యాశాఖకు ఉద్యోగ సంఘాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. హెచ్‌ఎంఆర్ డేటా ఆధారంగా ఉద్యోగుల స్థానికతను నిర్ధారించాలని టీఎన్జీవో నేతలు జిల్లా యంత్రాంగాన్ని కోరినట్లు తెలిసింది.
లోకల్ లొల్లి
Published Sat, May 24 2014 12:20 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement