
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రాథమిక వసతుల సమస్య వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో అయిదువందలకు పైగా కొత్త గురుకుల పాఠశాలలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. ఈ క్రమంలో అద్దె భవనాల్లోనే వీటిని స్థాపించగా... ప్రస్తుతం అక్కడ వసతుల సమస్య తలెత్తింది. క్రమంగా తరగతులు పెరుగుతుండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.దీంతో తొలుత తీసుకున్న భవనాల విస్తీర్ణం సరిపోకపోవడంతో తరగతుల నిర్వహణ భారంగా మారుతోంది.ఈక్రమంలో 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి సీట్లను సొసైటీలు కోత పెట్టాయి. ఇందులో గిరిజన గురుకుల సొసైటీలో 900సీట్లు, బీసీ గురుకుల సొసైటీలో 400 సీట్లు తగ్గాయి.
రెండుకు బదులుగా ఒక సెక్షన్‌తో...
సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతీ తరగతికి 2 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 40 మంది వం తున విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తారు. ఈక్రమంలో 2019–20కి గాను రాష్ట్రవ్యాప్తంగా 613 గురుకుల పాఠశాలల్లో 47,740 మందికి అడ్మిషన్లు ఇస్తూ ఇటీవల టీజీసెట్ ఆదేశాలిచ్చింది. గత నెలలో నిర్వహించిన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా వారికి ఆన్‌లైన్‌లోనే సీట్లు కేటాయించింది. ఈనెల 31లోగా నిర్దేశిత పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలని స్పష్టం చేసింది.వాస్తవానికి 613 గురుకుల పాఠశాలల్లో రెండు సెక్షన్లలో 80 మంది విద్యార్థుల వంతున 49,040 సీట్లు భర్తీ చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేవలం 47,740 సీట్లకు సెట్ కన్వీనర్ పరిమితం చేయడం గమనార్హం. ఇందులో 338 బాలికల గురుకులాల్లో 26,370 సీట్లు, 275 జనరల్ గురుకులాల్లో 21,370 సీట్లు భర్తీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment