సాక్షి, కరీంనగర్ ఎడ్యుకేషన్: కస్తూరీబాగాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న బాలికలకు, మోడల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం నూతన సంవత్సరం కానుక అందించింది. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కొత్త సంవత్సరం కానుకగా సోమవారం నుంచి కొత్త మెనూ అమలు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు అన్నం, పప్పు, గుడ్డుతో సాగుతున్న మెనూలో పలు మార్పులు చేశారు. ఇకపై నెలకు ఐదు రోజులు మాంసాహారం వడ్డించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని 11 మోడల్ స్కూల్స్, 12 కేజీబీవీ పాఠశాలలు, 4 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒకటి మహాత్మాగాంధీ జ్యోతి బాపూలే జూనియర్ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 10 వేల మందికి పైగా విద్యార్థులకు కొత్త మెనూతో ప్రయోజనం చేకూరనుంది.
నా ణ్యమైన విద్యను అందిస్తూనే పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేయాలని, ఒక్కో విద్యార్థిపై లక్ష పది వేల చొప్పున ఏటా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పౌష్టికాహార లోపంతో విద్యార్థుల్లో సరైన శారీరక, మానసిక ఎదుగుదల లేక ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు. రక్తహీనతతో తరచూ అనారోగ్యం పాలవుతున్నారని భావించి మెనూ మార్పుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రతి విద్యార్థిపై రోజుకు రూ.33.35 పైసలు వెచ్చించనుంది.
పేద విద్యార్థులకు వరం
కేజీబీవీ పాటు ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం మెనూ అందిస్తున్న తీరు అభినందనీయం, పేద విద్యార్థులకు వరం. పిల్లలకు పౌష్టికాహార లోపంతో తలెత్తే రుగ్మతలు మాయమవుతాయి. నాణ్యమైన భోజనం అందిస్తుండడంతో పిల్లలు పాఠశాలల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. డ్రాపవుట్స్ తగ్గే అవకాశం మెండుగా ఉంటుంది.
– కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్రీలత, కరీంనగర్ కేజీబీవీ
కొత్త మెనూ ఇదే...
వారానికి నాలుగు రోజులు కోడిగుడ్డు,ఆరు రోజులు పండ్లు
ఒకటో, మూడో, ఐదో ఆదివారం చికెన్
రెండో, నాలుగో ఆదివారం మటన్
ప్రతిరోజూ పాలు.. నెయ్యి
సాయంత్రం లేదా రాత్రి భోజన సమయంలో స్నాక్స్
వారంలో కనీసం నాలుగైదు రకాల ఆకుకూరలు, ఎనిమిది రకాల కూరగాయలతో కూరలు
ప్రతి శనివారం స్వీటు
Comments
Please login to add a commentAdd a comment