welfare schools
-
వారికి పాకెట్ మనీ రూ.500 ..
సాక్షి, నిర్మల్ : విద్యతోనే ప్రగతి సాధ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వారికి ఎస్సీ వసతి గృహాల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నారు. ట్యూషన్ ఫీజు, మెస్‌బిల్లు, పరీక్ష ఫీజు ఇలా ఎన్నో మినహాయింపు ఇస్తున్నారు. అయితే విద్యార్థి దశ నుంచి కళాశాల స్థాయికి వచ్చే సరికి ఆర్థిక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. జేబు ఖర్చులు కూడా ఇంటి నుంచి తెచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో లోలోన మదనపడుతున్నారు. వీరి ఇబ్బందులు ఇక దూరం కానున్నాయి. కళాశాల విద్యార్థులకు నెలకు రూ.500 కళాశాల వసతి గృహాల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు జేబు ఖర్చుల కింద సాయం అందించే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వీరికి ప్రతి నెల ఠంచన్‌గా నెలకు రూ.500చొప్పున అందజేయనుంది. ప్రస్తుతం వసతి గృహాల్లో కేవలం పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు మాత్రమే కాస్మోటిక్ చార్జీ లు అందిస్తున్నారు. బాలురకు రూ.62, బాలికలకు 3 నుంచి 7వ తరగతి చదివేవారికి రూ.55, అలాగే 8,9,10 తరగతుల వారికి రూ.75 అందిస్తున్నారు. కేవలం పదో తరగతి వరకు విద్యనభ్యసించి, మధ్యలో ఆపివేయకుండా ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు సైతం నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో వసతి ఏర్పాటు చేసింది. ఈ మేరకు షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కళాశాల వసతి గృహాలను జిల్లాలో ఇదివరకే ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇలా అమలు.. నిర్మల్ జిల్లాలో మొత్తం ఐదు ఎస్సీ కళాశాలల వసతి గృహాలు ఉన్నాయి. నిర్మల్‌లో రెండు బాలికల, ఒకటి బాలుర వసతి గృహం ఉండగా, భైంసాలో ఒకటి బాలికల, ఒకటి బాలుర వసతి గృహం ఉంది. ఇందులో మొత్తం 366మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ వసతి గృహాల్లో పారామెడికల్, నర్సింగ్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు చదువుకుంటున్నారు. కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు ప్రభుత్వం కేవలం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం అందిస్తోంది. కాస్మోటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు ఇంటి వద్ద నుంచి డబ్బులు తెచ్చుకుని ఇతర అవసరాలకు ఖర్చు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఆర్థికభారం కావడంతో నెలనెలా అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఎస్సీ కళాశాల వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ నెలకు రూ.500 చొప్పున సాయం అందించనుంది. నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకే ఈ సొమ్ము జ మ చేయనుంది. అయితే ప్రతి నెలా ఈ డబ్బు లు పొందాలంటే 75శాతం హాజరు, 20 రోజు ల పాటు వసతి గృహంలో ఉండాలన్న నిబంధనలు విధించింది. ఇందుకోసం విద్యార్థి ప్రతి నెలా హాజరుకు సంబంధించి ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 75శాతం హాజరు తప్పనిసరి విద్యార్థులకు పాకెట్ మనీ కింద ప్రతినెలా డబ్బులు జమచేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల్లో 75శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ విద్యా సంవత్సరం జూన్ నుంచి విద్యార్థుల అకౌంట్లో డబ్బులు జమకానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సాయం అందిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అవసరాలకు మాత్రమే వినియోగించుకుని ఉత్తమ ఫలితాలపై దృష్టి సారించాలి. – కిషన్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి -
గురుకులాల్లో తగ్గనున్న సీట్లు..
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రాథమిక వసతుల సమస్య వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో అయిదువందలకు పైగా కొత్త గురుకుల పాఠశాలలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. ఈ క్రమంలో అద్దె భవనాల్లోనే వీటిని స్థాపించగా... ప్రస్తుతం అక్కడ వసతుల సమస్య తలెత్తింది. క్రమంగా తరగతులు పెరుగుతుండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.దీంతో తొలుత తీసుకున్న భవనాల విస్తీర్ణం సరిపోకపోవడంతో తరగతుల నిర్వహణ భారంగా మారుతోంది.ఈక్రమంలో 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి సీట్లను సొసైటీలు కోత పెట్టాయి. ఇందులో గిరిజన గురుకుల సొసైటీలో 900సీట్లు, బీసీ గురుకుల సొసైటీలో 400 సీట్లు తగ్గాయి. రెండుకు బదులుగా ఒక సెక్షన్‌తో... సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతీ తరగతికి 2 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 40 మంది వం తున విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తారు. ఈక్రమంలో 2019–20కి గాను రాష్ట్రవ్యాప్తంగా 613 గురుకుల పాఠశాలల్లో 47,740 మందికి అడ్మిషన్లు ఇస్తూ ఇటీవల టీజీసెట్ ఆదేశాలిచ్చింది. గత నెలలో నిర్వహించిన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా వారికి ఆన్లైన్లోనే సీట్లు కేటాయించింది. ఈనెల 31లోగా నిర్దేశిత పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలని స్పష్టం చేసింది.వాస్తవానికి 613 గురుకుల పాఠశాలల్లో రెండు సెక్షన్లలో 80 మంది విద్యార్థుల వంతున 49,040 సీట్లు భర్తీ చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేవలం 47,740 సీట్లకు సెట్ కన్వీనర్ పరిమితం చేయడం గమనార్హం. ఇందులో 338 బాలికల గురుకులాల్లో 26,370 సీట్లు, 275 జనరల్ గురుకులాల్లో 21,370 సీట్లు భర్తీ చేయనుంది. -
న్యూఇయర్.. న్యూ మెనూ
సాక్షి, కరీంనగర్ ఎడ్యుకేషన్: కస్తూరీబాగాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న బాలికలకు, మోడల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం నూతన సంవత్సరం కానుక అందించింది. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కొత్త సంవత్సరం కానుకగా సోమవారం నుంచి కొత్త మెనూ అమలు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు అన్నం, పప్పు, గుడ్డుతో సాగుతున్న మెనూలో పలు మార్పులు చేశారు. ఇకపై నెలకు ఐదు రోజులు మాంసాహారం వడ్డించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని 11 మోడల్ స్కూల్స్, 12 కేజీబీవీ పాఠశాలలు, 4 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒకటి మహాత్మాగాంధీ జ్యోతి బాపూలే జూనియర్ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 10 వేల మందికి పైగా విద్యార్థులకు కొత్త మెనూతో ప్రయోజనం చేకూరనుంది. నా ణ్యమైన విద్యను అందిస్తూనే పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేయాలని, ఒక్కో విద్యార్థిపై లక్ష పది వేల చొప్పున ఏటా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పౌష్టికాహార లోపంతో విద్యార్థుల్లో సరైన శారీరక, మానసిక ఎదుగుదల లేక ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు. రక్తహీనతతో తరచూ అనారోగ్యం పాలవుతున్నారని భావించి మెనూ మార్పుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రతి విద్యార్థిపై రోజుకు రూ.33.35 పైసలు వెచ్చించనుంది. పేద విద్యార్థులకు వరం కేజీబీవీ పాటు ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం మెనూ అందిస్తున్న తీరు అభినందనీయం, పేద విద్యార్థులకు వరం. పిల్లలకు పౌష్టికాహార లోపంతో తలెత్తే రుగ్మతలు మాయమవుతాయి. నాణ్యమైన భోజనం అందిస్తుండడంతో పిల్లలు పాఠశాలల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. డ్రాపవుట్స్ తగ్గే అవకాశం మెండుగా ఉంటుంది. – కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్రీలత, కరీంనగర్ కేజీబీవీ కొత్త మెనూ ఇదే... వారానికి నాలుగు రోజులు కోడిగుడ్డు,ఆరు రోజులు పండ్లు ఒకటో, మూడో, ఐదో ఆదివారం చికెన్ రెండో, నాలుగో ఆదివారం మటన్ ప్రతిరోజూ పాలు.. నెయ్యి సాయంత్రం లేదా రాత్రి భోజన సమయంలో స్నాక్స్ వారంలో కనీసం నాలుగైదు రకాల ఆకుకూరలు, ఎనిమిది రకాల కూరగాయలతో కూరలు ప్రతి శనివారం స్వీటు -
529 గురుకులాల ఏర్పాటు: కడియం
హైదరాబాద్ : రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్య అమలులో భాగంగా 529 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. మంగళవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానం ఇచ్చారు. విద్యావ్యవస్థ పటిష్టత కోసం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పేద వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. 2017-18 విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది 5 వేల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన కొనసాగుతుందని చెప్పారు. కేజీ టు ఫోర్త్ క్లాస్ వరకు అంగన్వాడీలను కూడా కలుపుకొని నడిపిస్తామని చెప్పారు. 5 నుంచి 12వ తరగతి వరకు గురుకులాల్లో విద్యా బోధన జరుగుతుందన్నారు. 2014 తర్వాత 6 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 9 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిధుల కొరత కారణంగా ఎలాంటి ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడలేదన్నారు. నీట్ పరీక్షలో ఫలితాలను మెరుగుపర్చడానికి ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. -
'బీసీ గురుకులాల్లో ఖాళీలు పూరిస్తాం'
హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోయే బీసీ గురుకుల విద్యాలయాల్లో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. శనివారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 119 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇందులో 56 బాలురు, 63 బాలికల గురుకులాలను నిర్మిస్తామని తెలిపారు. బీసీ గురుకులాల ఏర్పాటుకు స్థలాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు. -
63 మంది విద్యార్థులకు అస్వస్థత
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని అన్నపురెడ్డిపల్లిలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనంలో వంకాయ కూర, సాంబారు, మజ్జిగ వడ్డించారు. తెల్లవారేసరికి 63 మంది విద్యార్థులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 16 మందిని కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. మిగిలినవారికి యర్రగుంట పీహెచ్సీలో చికిత్స చేశారు. అస్వస్థతకు గురైనవారిలో 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు అస్వస్థతతోనే ఈ రోజు పరీక్ష రాశారు. పాఠశాలలో మొత్తం 610 మంది విద్యార్థులు ఉన్నారు. చండ్రుగొండ ఎస్సై, వైద్య సిబ్బంది పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. -
సంక్షేమ పాఠశాలలకు నిధులిస్తాం: ఈటల
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమశాఖల పరిధిలోని విద్యావ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సంక్షేమ రంగంలోని పాఠశాలలు, హాస్టళ్లను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించాలని, దీనికి అవసరమైన నిధులు సమకూర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు తపన, కమిట్మెంట్తో పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ హాస్టళ్లపై స్పష్టమైన అవగాహన ఉంద ని, అందులో భాగంగానే రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. వార్డెన్ ఉద్యోగం, తల్లిదండ్రులు నిర్వహించే పాత్ర కంటే తక్కువ కాదని, పనితీరులో ఓ వ్యవస్థ ఏర్పాటుచేసి, కష్టపడి పనిచేయాలన్నారు. సంక్షేమ హాస్ట ళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లపై సెంటర్‌ఫర్ సోషల్ డెవలప్మెంట్ సర్వే నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన సందర్భంగా సచివాలయంలో ఆ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ రెడ్డప్ప పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
'సంక్షేమ పాఠశాలలపై నిర్లక్ష్యమెందుకు'
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు పదో తరగతి విద్యార్థి మృతిపై దిగ్భ్రాంతి కనీస మౌలిక సదుపాయాల్లేక కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకెళ్లి పదో తరగతి విద్యార్థి ఒకరు మృత్యువాత పడిన దుర్ఘటనపై హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాంఘిక సంక్షేమ పాఠశాలలపై ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రస్తుతం వాటి దుస్థితిపై వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఇలా మృత్యువాత పడుతున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వ విధానమేమిటో తెలియజేయాలంటూ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మదనపురంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న తన ఏకైక కుమారుడి అకాల మృతికి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించకపోవడమే కారణమంటూ రామకృష్ణమ్మ అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. వసతిగృహంలో తగిన సౌకర్యం లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని నీటికుంట వద్దకెళ్లి, అందులో పడిపోయాడని పిటిషన్లో తెలిపారు. తనకు మరో ఆధారం లేనందున రూ. 5 లక్షల నష్టపరిహారం, 3 ఎకరాల భూమి, ఉద్యోగం ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆమె పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి... విద్యార్థి మృతి ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. ‘‘సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ పాఠశాలలపై మీరు ఎందుకింత నిర్లక్ష్యం చూపుతున్నారు? హాస్టల్లో నీరు అందుబాటులో లేకపోవడానికి బాధ్యులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో ఆ వివరాలతో అఫిడవిట్‌ను కోర్టు ముందుంచండి. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా అందులో వివరించండి. ఇలాంటి పరిస్థితుల్లో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటో కూడా చెప్పండి’’ అని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.