రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
పదో తరగతి విద్యార్థి మృతిపై దిగ్భ్రాంతి
కనీస మౌలిక సదుపాయాల్లేక కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకెళ్లి పదో తరగతి విద్యార్థి ఒకరు మృత్యువాత పడిన దుర్ఘటనపై హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాంఘిక సంక్షేమ పాఠశాలలపై ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రస్తుతం వాటి దుస్థితిపై వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఇలా మృత్యువాత పడుతున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వ విధానమేమిటో తెలియజేయాలంటూ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మదనపురంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న తన ఏకైక కుమారుడి అకాల మృతికి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించకపోవడమే కారణమంటూ రామకృష్ణమ్మ అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు.
వసతిగృహంలో తగిన సౌకర్యం లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని నీటికుంట వద్దకెళ్లి, అందులో పడిపోయాడని పిటిషన్‌లో తెలిపారు. తనకు మరో ఆధారం లేనందున రూ. 5 లక్షల నష్టపరిహారం, 3 ఎకరాల భూమి, ఉద్యోగం ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆమె పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి... విద్యార్థి మృతి ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. ‘‘సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ పాఠశాలలపై మీరు ఎందుకింత నిర్లక్ష్యం చూపుతున్నారు? హాస్టల్‌లో నీరు అందుబాటులో లేకపోవడానికి బాధ్యులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో ఆ వివరాలతో అఫిడవిట్‌ను కోర్టు ముందుంచండి. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా అందులో వివరించండి. ఇలాంటి పరిస్థితుల్లో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటో కూడా చెప్పండి’’ అని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.
'సంక్షేమ పాఠశాలలపై నిర్లక్ష్యమెందుకు'
Published Wed, Dec 11 2013 3:13 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement