529 గురుకులాల ఏర్పాటు: కడియం
Published Tue, Mar 21 2017 11:18 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
హైదరాబాద్ : రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్య అమలులో భాగంగా 529 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. మంగళవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానం ఇచ్చారు. విద్యావ్యవస్థ పటిష్టత కోసం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పేద వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. 2017-18 విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది 5 వేల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన కొనసాగుతుందని చెప్పారు.
కేజీ టు ఫోర్త్ క్లాస్ వరకు అంగన్‌వాడీలను కూడా కలుపుకొని నడిపిస్తామని చెప్పారు. 5 నుంచి 12వ తరగతి వరకు గురుకులాల్లో విద్యా బోధన జరుగుతుందన్నారు. 2014 తర్వాత 6 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 9 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిధుల కొరత కారణంగా ఎలాంటి ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడలేదన్నారు. నీట్ పరీక్షలో ఫలితాలను మెరుగుపర్చడానికి ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
Advertisement
Advertisement