‘భద్రత’ గాలికి.. నిఘా నిద్రలోకి..
⇒ దొంగల హల్‌చల్‌తో బెంబేలు
⇒ పేట్రేగుతున్న ఆకతాయిలు
⇒ కాలనీల్లోని ఇళ్లపై దాడులు
⇒ భయంతో వణుకుతున్న జనం
⇒ సీఎం ఇలాఖాలో భయాందోళన
⇒ పోలీసింగ్ తీరుపై విమర్శల వెల్లువ
గజ్వేల్: గజ్వేల్ అంటే.. ఇప్పుడు హాట్‌స్పాట్.. తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రాంతం. సీఎం కేసీఆర్ ఇలాఖాగా మారిన ఈ నగర పంచాయతీ నేడు అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. ఇలాంటి తరుణంలో ఇక్కడ స్థిర నివాసమేర్పరచుకోవడానికి ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్న వేళ.. భద్రత మాత్రం ప్రశ్నార్థకంగా మారటం ఆందోళన కలిగిస్తోంది. దొంగలు హల్‌చల్ ఒకవైపు.. ఆకతాయిల దాడులు మరోవైపు ప్రజలను కలవరపెడు తోంది. పోలీసింగ్ వైఫల్యం వల్లే ఈ దుస్థితి నెలకొందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గజ్వేల్ నగర పంచాయతీ జనాభా ఇప్పుడు గజ్వేల్‌తోపాటు ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్‌పల్లి, క్యాసారం గ్రామాలతో కలిపి 40 వేలకుపైగా ఉంది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో రింగ్ రోడ్డు, నగర పంచాయతీ ప్రజలకు గోదావరి నది ద్వారా శాశ్వత మంచినీటి పథకంతోపాటు ఎన్నో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే ఆందోళన కలిగించే అంశమేమంటే భద్రత.
వరుస దొంగతనాలు..
పట్టణంలో వరుసగా దొంగతనాలు, దోపీడీలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణంలోని సంపన్న కాలనీలను టార్గెట్‌గా చేసుకొని ఇలాంటి సంఘటనలు జరగటం కొత్తేమీకాదు. తాజాగా కొన్ని రోజుల నుంచి దొంగలు మరింత రెచ్చిపోవడమే బెంబేలెత్తిస్తోంది. ఇటీవల పిడిచెడ్ రోడ్డు వైపున గల ఓ దుకాణం వద్ద కూర్చున్న ఓ మహిళ మెడలోంచి మాస్క్‌లు ధరించిన ఇద్దరు యువకులు పట్టపగలే నాలుగు తులాలకుపైగా బంగారు గొలుసును చోరీ చేశారు. ఇదే క్రమంలో ఈనెల 5న ప్రజ్ఞాపూర్‌లోని నాగులుగౌడ్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉన్న సమయంలో దుండగులు చొరబడి నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
6న పట్టణంలోని ఈశ్వరసాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మెడలోంచి నాలుగు తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. ఇలా వరుస సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు కొన్ని కేసులు ఫిర్యాదులు వరకు రాకుండా మరుగున పడుతున్నాయనే ప్రచారం సాగుతుంది. ఇటీవల ఓ స్వచ్చంద సంస్థకు చెందిన వ్యక్తి బ్యాంకులో డబ్బులు డ్రా చేసి బయటకు రాగానే గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లలేదు.
పేట్రేగిన ఆకతాయిలు..
వరుస దొంగతనాలకు తోడూ ఆకతాయిల దాడులు పలు కాలనీల వాసులను కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ప్రధానంగా పట్టణంలోని నవజ్యోతి సమీపంలోని వాసవీనగర్‌ను టార్గెట్ చేసిన ఆకతాయిలు మూడు నెలలుగా బీభత్సం సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో కాలనీలోని పలువురి ఇళ్ల అద్దాలు పగులు గొట్ట డం, ఇంటి ముందుకు వచ్చి మద్యం బాటిళ్లు పగుల గొట్టి వెళ్లటం, కార్ల అద్దాలు పగుల గొట్టడం, బైక్‌లను ధ్వంసం చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. ఈ కారణంగా సదరు కాలనీవాసులకు కంటికి కునుకు కరువైంది. ఇదే కాలనీలో ఓ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు నివాసముండడం గమనార్హం.
ఈ వ్యవహారంపై పోలీ సులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో వరుసగా చోటుచేసుకుం టున్న దొంగతనాలు, ఆకతాయిల చేష్టలను నివారించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ-2పై కానిస్టేబుల్ తిరగబడటం ఈ వ్యవహారంపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.