♦ జాయింట్ కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
♦ జేసీలతో సీసీఎల్‌ఏ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: జూన్ రెండో తేదీన కొత్త జిల్లాలను ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు మరింత వేగం పుంజు కుంది. సీఎం నిర్దేశించిన గడువు దగ్గర పడటంతో అవసరమైన ఏర్పాట్లను చకచకా పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు వెంట నే పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల జేసీలతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త జిల్లాల సరిహద్దులు, మ్యాప్‌లు, ఇతర వివరాలన్నీ తాము కోరిన నమూనాలో పంపించాలని ఆదేశించారు. మరోవైపు కొత్త జిల్లాలకు సంబంధించి వెల్లువెత్తుతున్న ఆందోళనలు, ప్రజల డిమాండ్లపై సీఎం కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు.
కొత్త జిల్లాల ప్రతిపాదనలు, అభ్యంతరాలపై నివేదికలు వెంటనే అందించాలని మంత్రులు, పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాల వారీగా ద్విసభ్య కమిటీలు వేసిన సీఎం తమ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఏకాభిప్రాయంతో తనకు నివేదిక అందజేయాలని సీఎం పురమాయించి నట్లు సమాచారం. దీంతో జిల్లాల వారీగా పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లా నేతలు ప్రత్యేకంగా సమావేశమై తమ నిర్ణయాలను సీఎంకు వెల్లడించినట్లు తెలిసింది. అదే వరుసలో బుధవారం మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలు సమావేశమయ్యారు.
రంగారెడ్డి జిల్లాను 3 కొత్త జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వేరే ప్రాంతాలను తమ పరిధిలో విలీనం చేసేందుకు ఇబ్బంది లేదని, అయితే నల్లగొండ పరిధిలో ఏర్పడే జిల్లాల్లో తమ ప్రాంతాలను విలీనం చేయవద్దన్నారు. మరోవైపు తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు సాగుతున్నాయి. వరంగల్ జిల్లా మహబూబాబాద్, భూపాలపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాలలో ఆందోళనలు ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి.