బడికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే
- ఏళ్లు గడుస్తున్నా ప్రారంభంకాని శేరిపల్లి వంతెన నిర్మాణం
- వర్షాకాలం వస్తే ఇంట్లోనే విద్యార్థులు, రైతులు
- బడి మాన్పించి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు
- పొలాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే రైతులు
- నాలుగేళ్లయినా కదలని బ్రిడ్జి పనులు
సాక్షి, వనపర్తి: పాలకులు మారారు.. ప్రభుత్వాలు మారాయి..కానీ ఆ గ్రామ ప్రజలకు వాగు దాటేందుకు కావాల్సిన బ్రిడ్జి నిర్మాణం మాత్రం ముందుకు సాగలేదు. విద్యార్థులు బడికి వెళ్లాలన్నా.. రైతులు, కూలీలు పొలాలకు వెళ్లి పనులు చేసుకోవాలన్నా.. నడుము లోతు నీటిలో వాగు దాటాల్సిందే. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యపై స్పందించిన నాయకులెవరూ లేరు. గ్రామస్తులు నాయకులకు, అధికారులకు పలుమార్లు సమస్యను విన్నవించినా.. పట్టించుకున్న పాపానపోలేదు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం శేరిపల్లి గ్రామస్తులు ఎదుర్కొంటున్న అవస్థలివి.
వాగు ఉధృతి ఉంటే బడి బంద్
శేరిపల్లిలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. గ్రామానికి చెందిన విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రావాల్సిందే. ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. పొలాలు, అడవి మధ్యలో నుంచి కాలిబాటన నడుచుకుంటూ..వెళ్లాలి. మధ్యలో జూరాల కాల్వపై ఉన్న జింకలోని బావివాగును దాటాల్సిందే. వర్షాకాలంలో అయితే పాఠశాలకు వెళ్లాలని ఇంటినుంచి వాగు వరకు వచ్చి వాగు ఉధృతి చూసి వెనుదిరగాల్సిందే. ఒక్కోరోజు నడుము లోతు ప్రవహిస్తున్న నీటిలో వాగుదాటి పాఠశాలకు వెళ్లాలి. రోజూ పిల్లలను వాగు దాటి బడికి పంపించడం కంటే బడి మానివేయించి కూలి పనులకు పంపిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఇక తొమ్మిదో తరగతి వరకు అమ్మాయిలను చదివించి, ఆ తర్వాత బాల్యవివాహాలు చేస్తున్నారు. అయినా కొందరు విద్యార్థులు బాగా చదువుకోవాలనే ఆకాంక్షతో పాఠశాలకు వెళ్తున్నారు. మరోవైపు శేరిపల్లి, శ్రీరంగాపూర్ గ్రామాల మధ్య ఉన్న పొలాలకు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే రైతులు, కూలీలకు తిప్పలు తప్పడం లేదు. పంటలు దున్నించే సమయంలో, కోతకు వచ్చినప్పుడు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లను వాగు దాటించడానికి రైతులు పడే బాధలు వర్ణనాతీతం.
నాలుగేళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు
శేరిపల్లి, శ్రీరంగాపూర్ ప్రజల కష్టాలను గుర్తిం చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల కాలువపై రెండు గ్రామాల మధ్య జింకలోని బావి వాగుపై 2012 జనవరిలో బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచింది. రూ.1,98,13,280 అంచ నా వ్యయంతో టెండర్లు పిలిస్తే 13 సంస్థలు పోటీ పడ్డాయి. ననీత కన్‌స్ట్రక్షన్స్ సంస్థ రూ.1,66,39,193కి పనులు దక్కించుకుం ది.12 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఫిల్లర్ గుంతలు తీసిన కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకుండానే వెనుకడుగు వేశాడు.
బడి మాన్పిస్తున్నారు..
పాఠశాలకు వెళ్లాలి అంటే వాగుదాటి పోవాలి. ప్రతి రోజూ ఎనిమిది కిలోమీటర్ల దూరం కాలినడకనే వెళ్తుంటాం. పోయిన సంవత్సరం నాతో పాటు ఏడుగురు అమ్మాయిలు వచ్చేవారు. వాగుదాటి నడుచుకుంటూ వెళ్లి రావటం కష్టంగా ఉండటంతో వారిని బడి మాన్పించారు. కొందరికి పెళ్లిళ్లు కూడా చేశారు.
– వి.శ్యామల,పదవ తరగతి,శేరిపల్లి
ఎన్నో ఏళ్ల అవస్థ..
ఎన్నో ఏళ్లుగా ఇదే అవస్థలు పడుతున్నాం. నీటి ఉధృతి అధికంగా ఉన్నప్పుడు వాగుదాటడం చాలా కష్టంగా ఉంటుంది. పొలం పనులకు వెళ్లాలి. తప్పనిసరిగా వాగును దాటుతుంటాం. నాలుగేళ్ల క్రితం బ్రిడ్జిని కడుతున్నామని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ఊసేలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలి.
– బాలమ్మ, శేరిపల్లి