తైక్వాండో రారాణి శివాని | Shivani Thai Quando Queen In Nizamabad | Sakshi
Sakshi News home page

తైక్వాండో రారాణి శివాని

Published Wed, Mar 6 2019 8:37 AM | Last Updated on Wed, Mar 6 2019 8:40 AM

Shivani Thai Quando Queen In Nizamabad - Sakshi

పతకం గెలిచిన జట్టు సభ్యులతో తైక్వాండో క్రీడాకారణి శివాని

ఆడపిల్ల అంటేనే చిన్నచూపు! అది ఒకప్పుడులే!! ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. అమ్మాయిలూ అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారు. చదువేకాదు ఏ రంగంలోనైనా మేమూ ఏదైనా సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు నేటి యువతులు. ప్రోత్సాహం ఉండాలే గాని క్రీడారంగంలో పతకాల మీద పతకాలు తెస్తామంటున్నారు. అందుకు అంతర్జాతీయస్థాయిలో తైక్వాండో క్రీడలో రాణిస్తోన్న ఇందూరు రారాణి ధాత్రిక శివానియే నిదర్శనం. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

నిజామాబాద్‌స్పోర్ట్స్‌: ఒకప్పుడు ఆడ పిల్లలు పెళ్లి కాకముందు ఇంటికి, పెళ్లయ్యాక వంటింటికే పరిమితమయ్యేవారు. మరి ఇప్పుడు ఆ ధోరణి మారింది. ఆధునికంగా ఆలోచిస్తున్నారు. కాలానికనుగుణంగా మారాలని నిర్ణయించుకుంటున్నా రు. చదువు, ఉద్యోగం, క్రీడలు, ఇతర పోటీ పరీక్షల్లో ప్రతిభ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాల్లో అమ్మాయిలూ అదుర్స్‌ అనిపిస్తున్నారు. ఆ కోవకు చెందినవారే ధాత్రిక శివాణి. తనకు ఇష్టమైన క్రీడారంగంలో విశేషంగా రాణిస్తోంది. ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులు స్వేచ్ఛగా నీ ఇష్టం వచ్చినట్లు ఉండు.. నీకు ఇష్టమున్నది నేర్చుకో.. అంటూ చెప్పగానే ఆ మాటలనే స్ఫూర్తిగా తీసుకున్న శివాణి అందరిలా కాకుండా తాను ఏదో సాధించాలనుకుంది. అదే ఆశయంతో చిన్ననాటి నుంచే పట్టుదలతో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాధించుకోవాలని ఇటు చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకుంది. ఫలితంగా తైక్వాండో క్రీడలో ప్రతిభ చూపుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధిస్తోంది.

కుటుంబ నేపథ్యం..

జిల్లా కేంద్రానికి చెందిన ధాత్రిక శ్రీనివాస్‌–పద్మలత మొదటి కూతురైన శివాని చిన్న నాటి నుంచే చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తోంది. రన్నింగ్, హైజంప్, లాంగ్‌జంప్‌లలో తన ప్రతిభను చాటుతూనే పాఠశాల స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఒకటి నుంచి 5వ తరగతి వరకు అపూర్వ విద్యాలయంలో 6 నుంచి 10 ఆర్‌బీవీఆర్‌ఆర్‌ పాఠశాలలో చదువు కొనసాగింది. 10వ తరగతిలో 9 జీపీఏ సాధించింది. ఇంటర్‌ నారాయణ కాలేజీలో చదివి మంచి మార్కులతో ప్రతిభను చాటింది.

హైదరాబాద్‌లోని బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతూ మిగతా సమయంలో ఖాళీగా ఉండకుండా తన సీనియర్‌ తైక్వాండో అడడం చూసి డిఫెన్స్‌ కోసమైనా తైక్వాండో నేర్చుకోవాలని పట్టుదలతో శిక్షణ తీసుకొని అమీర్‌పేటలోని మోయిన్‌ మాస్టర్‌ దగ్గర మొదట కోచింగ్‌లో చేరింది. గ్రాండ్‌ మాస్టర్‌ జయంత్‌రెడ్డి దగ్గర కోచింగ్‌ తీసుకుంటూ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో తైక్వాండోలో రాటుదేలింది. అప్పటి నుంచి తైక్వాండో ఆటను సీరియస్‌గా తీసుకొని పోటీలలో పాల్గొనడం ప్రారంభించింది. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల వరకు అనేక పతకాలను సాధించింది.

 శివాణి రికార్డులు మచ్చుకు కొన్ని.. 

  •  2018 ఒక్క నిమిషంలో 139 ఎల్‌బ్లోస్టోర్‌లు కొట్టి హైరేంజ్‌ వరల్డ్‌ రికార్డు బుక్‌లో స్థానం సాధించింది. 
  •  2018 ఆగస్టు 24, 26 తేదీలలో మలేషియాలో జరిగిన 12వ క్లాసిక్‌ ఇంటర్నేషనల్‌ తైక్వాండో పోటీలలో 3వ స్థానంలో నిలిచి భారత దేశానికి బ్రాంజ్‌ మెడల్‌ను సాధించింది. 
  •  2018 జనవరి 21న తెలంగాణ స్టేట్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. 
  •  2017 ఆగస్టు 27న ఎన్‌సీసీ బెస్ట్‌ క్యాడెట్‌ అవార్డు పొందింది. 

ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యమే లక్ష్యం

ఒలింపిక్స్‌లో తాను భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిన్ననాటి నుంచి చదువుతోపాటు ఆటలపై మక్కువ పెంచుకున్నా. సెల్ఫ్‌ డిఫెన్స్‌ కోసం నేర్చుకొని తైక్వాండో ఆటను ఆశయంగా మార్చుకున్నా. చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రభు త్వం సహకరిస్తే ఆటలో మరింత రాణిస్తాం.
  –ధాత్రిక శివాని, అంతర్జాతీయ తైక్వాండో క్రీడాకారిణి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement