తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తామన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్
వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తామన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ ప్రకటన జారీ చేయడంతో సోమవారం నుంచి జిల్లాలో సందడి నెలకొననుంది. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 400 చొప్పున జిల్లాకు 4800 ఇళ్లను కేటాయించింది. దీంతో పాటు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ భూపాలపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకంగా మూడు వేల ఇళ్లు కేటాయించారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి గొప్ప విజయాన్ని అందించినందుకు ఈ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు మరో 30 వేల ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు రెట్టింపయ్యూరుు. దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా కేటాయిస్తారని భావిస్తున్న లబ్ధిదారులు.. తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌లో వేల సంఖ్యలో దరఖాస్తులు అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నందున అర్హులైన లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిసింది. లబ్ధిదారుల ఎంపికను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది.
నగరాల్లో డివిజన్ సభలు, గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు దరఖాస్తులను ఆన్‌లైన్‌ల్లో స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, డబుల్ బెడ్‌రూంల ఇళ్ల లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల్లో ఈసేవా, నగరంలో ఉన్న వారు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించడంతో ఈ కేంద్రాల ముందు జాతర సాగే అవకాశాలు నెలకొన్నాయి. దరఖాస్తుకు ఈ నెల 31 వరకు గడువు పెట్టారు. అరుుతే, గతంలో ఆధార్, రేషన్ కార్డుల కోసం ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గడువు పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
దండుకోనున్న దళారులు..
మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులకు ధరలు నిర్ణయించక పోవడంతో దళారులు ముందుగానే ఈ కేంద్రాలతో అవగాహన కుదుర్చుకున్నట్లు తెలిసిం ది. వీరు లబ్ధిదారులు జాబితాలను ముందుగానే తీసుకుని నమోదు చేయించినందుకు వందల రూపాయాలు దండుకునే అవకాశాలున్నాయి. మీ సేవా కేంద్రాలతో పాటు అన్‌లైన్‌లో ఎక్కడైనా నమోదు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో పాటు గడువు పెంచితే హడావుడి తగ్గి దళారుల వసూళ్లకు కూడా బ్రేక్ పడుతుంది.