యూక్టివ్‌గా లేరు
ఎర్రవల్లి మాదిరిగానే కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరులో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించాలని అనుకున్నం. ఇక్కడి అధికారులు బాగా పనిచేసి ఇండ్లను నిర్మించిండ్రు. కానీ కరీంనగర్ జిల్లాలో అధికారులు సరిగా పనిచేయకపోవడం వల్ల అక్కడ ఇంకా నిర్మాణాలే ప్రారంభం కాలేదు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా అధికారుల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా అధికారులతో పోలిస్తే కరీంనగర్ జిల్లా అధికారులు సరిగా పని చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఎర్రవల్లిలో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన సీఎం లబ్ధిదారులంతా మే 15 నుంచి నెలాఖరులోగా గృహప్రవేశం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలను పరిశీలిస్తే జిల్లా అధికార యంత్రాంగం క్రియాశీలకంగా పనిచేయడం లేదనే భావన కేసీఆర్‌లో ఏర్పడింది.
గతేడాది ఆగస్టు 4న హరితరహారం కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన సీఎం కేసీఆర్ చిగురుమామిడి మండలంలోని చిన్నముల్కనూరును దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. తర్వాత రెండుసార్లు గ్రామాన్ని సం దర్శించి పలు కార్యక్రమాలు చేపట్టారు. చిన్నముల్కనూరును రాష్ట్రానికే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. తక్షణమే డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ నీ తూప్రసాద్, ఎస్పీ జోయల్‌డేవిస్, జిల్లా అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు పలుమార్లు గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశా రు.
గ్రామంలో నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి 248 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించాలని నిర్ణయించా రు. ఈ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో ఇం టి నిర్మాణానికి రూ.5.05 లక్షల వ్యయమవుతుందని అంచనాతో టెండర్లు పిలిచారు. అయితే కాంట్రాక్టర్లెవరూ ఆసక్తి చూపలేదు. ప్రభుత్వ అంచనాతో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం సాధ్యం కాదని, తమకు గిట్టుబాటు కాద ని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ అధికారులు నాలుగుసార్లు టెండర్లు నిర్వహించినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో విషయాన్ని ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళ్లారు. సిమెంట్, స్టీలు ధరలను తగ్గిస్తే కాంట్రా క్టర్లు టెండర్లలో పాల్గొనే అవకాశముందని నివేదించారు.
అయితే చిన్నముల్కనూరులో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోయినప్పటికీ ఎర్రవల్లిలో మాత్రం అందుకు భిన్నం గా కాంట్రాక్టర్లు ముందుకు రావడమే కాకండా చకచకా ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తుండటంతో మెదక్ జిల్లా అధికారులను కేసీఆర్ అభినందించారు. అదే సమయం లో కరీంనగర్ జిల్లా అధికారులు సరిగా పనిచేయడం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో జిల్లా పర్య టనకు వచ్చిన సమయంలోనూ కేసీఆర్ జిల్లాకు పంచాయతీ అధికారులు సరిగా పనిచేయడం లేదని, పనితీరు మార్చుకోవాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆ తరువాత కొద్దిరోజులకే డీపీఓపై కలెక్టర్ వేటువేశారు.
జిల్లాలో అధికారులు తూతూమంత్రంగా పనిచేస్తున్నారే త ప్ప ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించలేకపోతున్నందే ఈ పరిస్థితి తలెత్తిందని అధికార పార్టీ నేత లు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామంలోనే పనులు కావడం లేదంటే జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో అధికారుల పనితీరు ఎట్లా ఉందో అంచనా వే యవచ్చని అంటున్నారు. పనితీరు విషయంలో అధికారులపై కఠినంగా వ్యవహరిస్తే తప్ప వారి పనితీరులో మా ర్పు వచ్చే అవకాశాల్లేవని అభిప్రాయపడుతున్నారు.