‘డబుల్‌బెడ్‌రూం’ ఎంపికలో అన్యాయం
కలెక్టరేట్‌లో ఇబ్రహీంపట్నం వాసుల ఆందోళన
ముకరంపుర : డబుల్ బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన మహిళలు బుధవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి వచ్చిన బాధితులను కాదంటూ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌కు వెళ్లడంతో వారు ఇదెక్కడి న్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి తమ సమస్య వినేవరకు కదిలేదిలేదంటూ భీష్మించారు. వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన దాదాపు 3గంటల అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో అక్కడే బైఠాయించిన మహిళలను కలుసుకున్నారు.
తమ గ్రామానికి మంజూరైన 41యూనిట్లలో దరఖాస్తు చేసుకున్న అర్హులను కాదని నాయకులు, మండల అధికారులు వారి అనుకూలమైనవారిని ఎంపిక చేసి గ్రామ సభలో ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. సమగ్ర విచారణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎంపిక చేసిన జాబితాలో రాజకీయ నాయకుల ప్రమేయముండడంతో ప్రజల మధ్య విద్వేషాలు పెరిగే అవకాశముందన్నారు. సమగ్రంగా సర్వే చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేలా చూడాలని కోరారు. స్పందించిన కలెక్టర్ నీతూ ప్రసాద్ సబ్‌కలెక్టర్ ద్వారా సమగ్ర విచారణ చేసి అర్హులకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు.