‘సింగరేణి’కి జర్మన్ కంపెనీల క్యూ
సంస్థ సీఎండీతో 15 కంపెనీల బృందం సమావేశం
సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల సరఫరాకు ప్రతిపాదనలు
హైదరాబాద్: సింగరేణికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు 15 జర్మనీ కంపెనీలు ముందుకు వచ్చాయి. సిమాగ్ టెక్‌బర్గ్, కామాట్, డీఎంటీ, ఎస్‌ఎంటీ, క్లీమన్, వీడీఎంఏ ఫ్రాన్‌ఫుర్ట్, జియో కాన్స్‌టెక్ తదితర సంస్థల ప్రతినిధుల బృందం సోమవారం సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌తో సమావేశమై ఈ మేరకు ప్రతిపాదనలు ముందుంచింది. ఈ సందర్భంగా శ్రీధర్ తమ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ‘సింగరేణి భవిష్యత్తులో 80 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో 15 కొత్త గనులను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ గనుల కోసం లాంగ్‌వాల్, కంటిన్యుయస్ మైనర్, డ్రిల్లింగ్, షాఫ్ట్ సింకింగ్ కోసం అత్యాధునిక యంత్రాలను కొనుగోలు చేసేం దుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ముందుకు రావాలి’ అని జర్మనీ కంపెనీలను కోరారు.
ఆయా కం పెనీలు సరఫరా చేసే యంత్రాలు వాటి పూర్తి జీవితకాలం పనిచేసే వరకూ సరఫరాదారు సేవలు అందించేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. తొలుత సింగరేణి గనులను సందర్శించి అవగాహన ఏర్పరుచుకున్నాక ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఉత్పత్తి పెంచవచ్చో ప్రతిపాదనలతో ముందుకు రావాలన్నారు. సింగరేణికి ఉన్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా యంత్రాలు అందించి ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. దీనిపై జర్మనీ బృందం సానుకూలత వ్యక్తం చేసింది.