
మృత్యువుతో పోరాటం..బతకాలని ఆరాటం
వారికి ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు. కూలికెళ్తేనే పూటగడిచేది. వీరికి ఒక్కగానొక్క కూతురు శిరీష. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.
వారికి ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు. కూలికెళ్తేనే పూటగడిచేది. వీరికి ఒక్కగానొక్క కూతురు శిరీష. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. తండ్రి అకాలమరణంతో తల్లి కూలి పనిచేసుకుంటూ బిడ్డకు ఏ లోటూ రాకుండా చూసుకుంటోంది. కానీ విధి చిన్నచూపు చూసింది. బిడ్డకు గుండెజబ్బు చేసింది. ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ముప్పని డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లి దాతలసాయం కోసం ఎదురుచూస్తోంది.
త్రిపురారం : త్రిపురారం మండలం మాటూరు గ్రామానికి చెందిన పులి జానయ్య, నాగమణి దంపతులు రోజు వారీ కూలీలు. వారికి ఒక్కగానొక్క కుమార్తె శిరీష. శిరీషకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి జానయ్య అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. అప్పటినుంచి కుటుంబం భారాన్ని తల్లి నాగమణి చూస్తోంది. శిరీషను చెన్నాయిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివించింది. ఆ తరువాత మిర్యాలగూడలోని అరవింద కాలేజీలో ఇంటర్(హెచ్‌ఈసీ) మొదటి సంవత్సరంలో చేర్పించారు. తల్లి ఆశలు నెరవేరుస్తుందని అందరూ భావించారు. ఈ క్రమంలో ఆరు నెలలుగా శిరీష తరుచు అనారోగ్యంతో బాధపడుతుండడంతో మిర్యాలగూడలోనే వైద్యులకు చూపించారు. వారి సూచనల మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి శిరీషను తీసుకెళ్లారు. గుండెకు రంధ్రం పడిందని, ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ ప్రాణాలకే ప్రమాదం ఉందని, ఆపరేషన్‌కు రూ.3లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. అంత ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేదు.
నా కూతురును కాపాడండి
గుండె జబ్బు బారినపడిన నా కూతురు శిరీషను దాతలు ఆదుకోవాలి. నిరుపేద కుటుంబం కావడంతో రెక్కల కష్టంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మాకు స్థిరాస్తులు లేకపోవడంతో ఆపన్న సాయం అందించేవాళ్ల కోసం ఎదురుచూస్తున్నా. ఆర్థిక సాయం చేసి నా కూతురు ప్రాణాలు కాపాడాలి.
- పులి నాగమణి, శిరీష తల్లి, మాటూరు