మధురఫలం అందేనా? | Sitaphal sales poor tribals | Sakshi
Sakshi News home page

మధురఫలం అందేనా?

Published Mon, Sep 28 2015 1:41 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

మధురఫలం అందేనా? - Sakshi

మధురఫలం అందేనా?

ప్రస్తుత సీజన్‌లో గ్రామీణులకు ఉపాధి కల్పించే సీతాఫలాల సేకరణ ఈసారి గణనీయంగా తగ్గింది.. ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు కురవడంతో క్రమంగా సీతాఫలాలు కనుమరుగవుతున్నాయి.. దీనికితోడు అడవులను యథేచ్ఛగా కొందరు వ్యక్తులు నరికివేయడంతో ఈ చెట్లు తగ్గుముఖం పట్టాయంటున్నారు..
ఇప్పటికైనా ప్రభుత్వం సీతాఫలంతోపాటు ఇతర పండ్ల మొక్కలను విరివిగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు..

   
*  అడవుల నరికవేతతో తగ్గిన సీతాఫలాలు 
* మొక్కలు నాటాలంటున్న గిరిజనులు
మర్పల్లి / షాబాద్ :పేదోని యాపిల్ పండుగా పిలిచే సీతాఫలాల విక్రయాలతో పలు గ్రామాల గిరిజన మహిళలు ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తారు. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితులతో చెట్లు ఎక్కువగా పెరగక సీతాఫలాల దిగుబడి తగ్గిందని వారు వాపోతున్నారు. మర్పల్లి మండలంలో మర్పల్లితండా, శాపూర్‌తండా, గుర్రంగట్టుతండా, పట్లూర్‌తండా, జాజుగుబ్భడితండా, దామస్తాపూర్ తండాలకు చెందిన గిరిజనులు సాధారణంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు సీతాఫలాలను పొలాలవద్ధ, అటవీప్రాంతంలో బీడు ప్రదేశాల్లో ఉన్న చెట్లనుంచి కాయలు తెంపుకొచ్చి తమ ఇళ్లలో కొర్రకంకి, వరిగడ్డి లేదా ఇతర గడ్డి సేకరించి రెండు, మూడు రోజులుగా నిల్వ ఉంచి పండ్లు తయారుచేస్తారు.అనంతరం జహీరాబాద్, వికారాబాద్ పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి ఒక్కో పండును రూ.ఐదు నుంచి రూ.పది వరకు అమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటారు. ఇక షాబాద్ మండలంలోని మాచన్‌పల్లి, కుమ్మరిగూడ, నాగరకుంట, నరెడ్లగూడ, కేశారం, కక్కులూర్, సీతారాంపూర్, ముద్దెంగూడ, మాచన్‌పల్లి, నాగరకుంట, దామర్లపల్లి, హైతాబాద్, మన్‌మర్రి, అంతారం ప్రజలు సీతాఫలాలను సేకరించి షాద్‌నగర్, షాబాద్, చేవెళ్ల, శంషాబాద్ తదితర మార్కెట్లలో సీతాఫలాలను విక్రయిస్తారు. అయితే సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా సీతాఫలాల సేకరణ ఆశించిన స్థాయిలో లేదు.

కాగా, ఒకప్పుడు కల్‌ఖోడ, శాపూర్‌తండా, దామస్తాపూర్, బూచన్‌పల్లిలో దట్టమైన అడవులు ఉండేవి. అయితే కొందరు కలప స్మగ్లర్లు క్రమేపీ అడవులను నరికివేస్తుండటంతో సీతాఫల చెట్లు తగ్గుముఖం పట్టాయని గిరిజనులంటున్నారు. తమకు జీవనాధారమైన సారా విక్రయాలను మానేసి కనీసం సీజన్లలో అడవి ఫలాలను విక్రయిస్తూ జీవనం వెళ్లదీస్తున్న తమను మాత్రం ప్రభుత్వం గుర్తించటంలేదని ఆరోపిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో సీతాఫల చెట్లతోపాటు, ఇతర పండ్ల చెట్లు నాటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
 
ఉపాధి మార్గాలు చూపాలి
గిరిజన కుటుంబాలను అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం ఉపాధి మార్గాలు చూపాలి. చదువుకున్న తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. స్వయం ఉపాధికోసం వడ్డీలేని ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వ భూముల్లో, అడవుల్లో ప్రత్యేకంగా పండ్ల మొక్కలను నాటించాలి. అడవిలో దొరికే ఫలాలకు పూర్తి హక్కు మాకే ఉండాలి.   
- సీతిబాయి, గుర్రగట్టుతండా, మర్పల్లి మండలం
 
భూపంపిణీ చేయాలి
గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం భూ పంపిణీ చేయాలి. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్‌ప్లాన్ పక్కాగా అమలు చేయాలి. సబ్‌ప్లాన్ ద్వారా మంజూరైన నిధులను ఇతర పనులకు మళ్లించవద్దు. 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ త్వరగా నెరవేర్చాలి.
- చందిబాయి, శాపూర్‌తండా, మర్పల్లి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement