
పటాన్‌చెరు: ఆరు గిన్నిస్ రికార్డులు సాధించి గీతం డీమ్డ్ యూనివర్సిటీ (హైదరాబాద్) విద్యార్థిని చరిత్ర సృష్టించింది. బీటెక్(సీఎస్‌ఈ) మూడో సంవత్సరం చదువుతున్న శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మంగళవారం ఈ రికార్డును నెలకొల్పింది. ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవా స్తవ, అనిల్‌శ్రీవాస్తవలతో కలసి పసుపు రంగులో ఉన్న 6132 ‘ఆరెగామీ సిట్రస్ ఫ్రూట్స్ ఇన్‌ఫ్లేటెడ్ లెమన్స్’(ఆరెగామీ పేపర్‌తో రూపొందించిన నిమ్మ తొనలను గాలితో నింపి ప్రదర్శనగా పెట్టడం)ను ఒకే చోట ఉంచి, ప్రపంచంలోని అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పింది. ఆరెగామీ కాగితంతో ఆరు వేల నిమ్మ తొనలను తయారు చేయడం ఒక ఎత్తయితే, వాటిన్నింటిలో గాలి నింపి ప్రదర్శనగా పెట్టడం మరో ఎత్తు.
ఈ ప్రదర్శనను ధ్రువీకరిస్తూ గిన్నిస్ నిర్వాహకులు ఆరో రికార్డును అందజేశారు. త్వరలో మరో ప్రదర్శనను గీతంలో ఏర్పాటు చేయనున్నట్లు శివాలి కుటుంబం తెలిపింది. గిన్నిస్ రికార్డు సాధించిన విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులను గీతం వైస్ చాన్సలర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ అభినందించారు. అంతకుముందు శివాలి క్విల్లింగ్ పేపర్‌తో చేతితో రూపొందించిన 1,251 బొమ్మలు, 7,011 పుష్పాలు, 2,111 విభిన్న బొమ్మలను తయారు చేసి గిన్నిస్ రికార్డు అందుకుంది. ఒకే రంగుతో 3,501 వేల్స్, 2,100 పెంగ్విన్లను కూడా శివాలి కుటుంబం రూపొందించి రికార్డు సైతం నమోదు చేసింది.