అమ్మానాన్న బాగున్నారా? | Smart Card Phones in Guruku Girls Schools in Warangal | Sakshi
Sakshi News home page

అమ్మానాన్న బాగున్నారా?

Published Tue, Mar 17 2020 11:08 AM | Last Updated on Tue, Mar 17 2020 11:08 AM

Smart Card Phones in Guruku Girls Schools in Warangal - Sakshi

ఫోన్‌ను ప్రారంభించి మాట్లాడిస్తున్న జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి(ఫైల్‌)

న్యూశాయంపేట : పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు రాష్ట్రప్రభుత్వం గురుకులాలు ఏర్పాటుచేస్తోంది. చదువుకునే సమయంలో రోజుల తరబడి తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే, తమ తల్లిదండ్రులతో మాట్లాడాలన్నా, వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవాలన్నా ఫోన్ల వాడకాన్ని భద్రతా చర్యల కారణంగా ప్రిన్సిపాళ్లు అనుమతించడం లేదు. తద్వారా ఎపుడో వారం, పదిహేను రోజులకోసారి తల్లిదండ్రులు వస్తే తప్ప మాట్లాడే వెసలుబాటు కలగడం లేదు. దీనికి పరిష్కారం ఓ మార్గం అందుబాటులోకి వచ్చింది.

నూతన సాంకేతిక పరిజ్ఞానంతో...
విద్యార్థులు తమ తల్లిదండ్రులతో అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి, వారియోగ క్షేమాలు తెలుసుకోవడానికి ఇటీవల అలైన్‌ గ్రూప్‌ ఓ నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రిన్సిపాళ్లు తమ క్యాంపస్‌ ఆవరణలో ఉండే విద్యార్థుల సంఖ్యకు తగిన సామర్థ్యంలో ఫోన్‌ అమరుస్తారు. ఏ విద్యార్థి అయితే తగిన రుసుము చెల్లించి స్మార్ట్‌ కార్డ్‌ తీసుకుంటారో వారి తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లను మాత్రమే ఆ ఫోన్‌లో నిక్షిప్తం చేస్తారు. తద్వారా ముందస్తు నమోదు చేసి నంబర్‌కు మాత్రం ఫోన్‌ చేసుకునే వెసలుబాటు కలుగుతుంది. దీంతో ఫోన్లు దుర్వినియోగం అవుతాయనే బాధ కూడా ఉండదు. తాజాగా ఈ ఫోన్లను వరంగల్‌ అర్బన్‌ జిల్లా హంటర్‌ రోడ్డులోని బాలికల మైనార్టీ గురుకులం(హన్మకొండ) పాఠశాలలలో ఏర్పాటు చేశారు.

సురక్షితం
స్మార్డ్‌ కార్డ్‌ ఫోన్‌తో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మాత్రమే ఫోన్‌ చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఫోన్‌లో ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ మాత్రమే చేసుకోవచ్చు. తగిన రుసుము చెల్లించి కార్డు కొనుగోలు చేసిన విద్యార్థి పేరెంట్స్‌ అందించిన మూడు ఫోన్‌ నంబర్లు నిక్షిప్తం చేస్తారు. బిగించిన ఫోన్‌లో మూడు బటన్లు ఉంటాయి. ఓ విద్యార్థి తన కార్డును స్వైప్‌ చేశాక ఏదో ఒక నంబర్‌ నొక్కితే అందులో ముందే ఫీడ్‌ చేసిన సెల్‌ఫోన్‌ నంబర్‌కు కాల్‌ వెళ్తుంది. ప్రిన్సిపాళ్లు నిర్ణయించిన సమయంలో ఫోన్‌ చేసేలా  నిబంధన విధించారు.

హాస్టళ్లలో ఉచితంగా బిగింపు
హాస్టళ్లలో ఈ ఫోన్లను ఎలాంటి రుసుము తీసుకోకుండానే ‘అలైన్‌’ సంస్థ బాధ్యులు ఏర్పాటు చేస్తారు. ప్రతినెల ప్రతినిధి వచ్చి ఫోన్‌ బాగోగులు చూసి వెళ్తాడు. లోకల్‌ అండ్‌ ఎస్‌టీడీ కాల్స్‌ ప్రతీ నిమిషానికి 60 పైసలు కట్‌ అవుతాయి. స్మార్ట్‌ కార్డ్‌ కొనుగోలు చేసినప్పుడు రూ.200 చెల్లించాలి. అందులో రూ.వంద టాక్‌టైమ్‌ వస్తుంది. టాక్‌టైమ్స్‌ అయిపోయాక తిరిగి తగిన రుసుము చెల్లించి రీచార్జ్‌ చేసుకోవచ్చు.

విద్యార్థులకు ఎంతో ఉపయోగం
ఈ ఫోన్‌తో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంది. గతంలో స్కూల్‌ ఫోన్‌ ఒకటే ఉండటంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులతో మాట్లాడించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు కొత్త ఫోన్‌తో వారికి కేటాయించిన సమయాల్లో ఫోన్‌ చేసుకొని సంతోషంగా ఉంటున్నారు.– వాసవి, పిన్సిపాల్, బాలికల మైనార్టీ గురుకులం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement