టికెట్‌ లేకున్నా.. రైట్‌..రైట్‌ | Smart Card System to implement in Hyderabad RTC Buses | Sakshi
Sakshi News home page

టికెట్‌ లేకున్నా.. రైట్‌..రైట్‌

Published Fri, Jul 7 2017 3:08 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

టికెట్‌ లేకున్నా.. రైట్‌..రైట్‌

టికెట్‌ లేకున్నా.. రైట్‌..రైట్‌

♦  స్మార్ట్‌ కార్డులతోనే బస్సు చార్జీల చెల్లింపు
  కండక్టర్లు లేకుండా నిర్వహణ
♦  ఆటోమేటిగ్గా చార్జీల చెల్లింపు కోసం పరికరాలు
♦  సింగపూర్‌ సంస్థతో ఆర్టీసీ చర్చలు
♦   త్వరలో 500 బస్సుల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు  


సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు ఎక్కగానే ‘టికెట్‌.. టికెట్‌..’అంటూ కండక్టర్‌ రావడం తెలుసు.. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కండక్టర్‌కు బదులు డ్రైవరే టిమ్‌ యంత్రం ద్వారా టికెట్‌ ఇవ్వడమూ చూశాం. కానీ ఎటువంటి టికెట్‌ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే.. బస్సులో ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి ఆటోమేటిగ్గా చార్జీల చెల్లింపు జరిగిపోయే సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. స్మార్ట్‌ కార్డులు, ప్రత్యేక యంత్రాల ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. విదేశాల్లోని కొన్ని నగరాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు సింగపూర్‌కు చెందిన ఓ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు.

సింగపూర్‌ ప్రతినిధులతో భేటీ
బస్సుల్లో కొత్త వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, ఉన్నతాధికారులు గురువారం సింగపూర్‌కు చెందిన ఓ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. తొలుత ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని 500 సిటీ బస్సుల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. సింగపూర్‌ సంస్థ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో ప్రదర్శించింది. అయితే కిక్కిరిసి, ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణించే మన బస్సులకు ఆ వ్యవస్థ సరిపోదని పేర్కొన్న అధికారులు... పలు మార్పు చేర్పులు సూచించారు.

ఈ మేరకు మార్పులు చేసి 15 రోజుల్లో సిద్ధం చేస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక ఈ ప్రయోగం సఫలమైతే మిగతా బస్సుల్లోనూ ‘స్మార్ట్‌’వ్యవస్థ’ను అమలు చేస్తామని సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. తొలుత ప్రయాణికులు కార్డును యంత్రం ముందు చూపాల్సి ఉంటుందని.. అనతి కాలంలోనే కార్డు జేబులో ఉన్నా నేరుగా సెన్సార్లే రుసుమును మినహాయించుకునే విధానం అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కండక్టర్ల వేతనాల రూపంలో ఆర్టీసీపై పడుతున్న భారాన్ని తగ్గించు కోవడమే ఈ  ఏర్పాటు ఉద్దేశమన్న విమర్శలు వస్తున్నాయి. దీన్ని విరమించుకోవాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేత రాజిరెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఎలా వసూలవుతుంది?
బస్సుల్లో ముందు, వెనక తలుపుల వద్ద ప్రత్యేక యంత్ర పరికరాలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు విధిగా ముందు తలుపు నుంచి ఎక్కి వెనుక తలుపు నుంచి దిగాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్, రూపేకార్డులతోపాటు ఆర్టీసీ ప్రత్యేకంగా జారీ చేసే స్మార్ట్‌కార్డులతో ఈ సాంకేతిక వ్యవస్థ అనుసంధానమవుతుంది. ప్రయాణికుడు ముందు తలుపు నుంచి ఎక్కినప్పుడు.. ఆ చోటు నుంచి చివరి గమ్యస్థానం వరకు నిర్ధారించిన టికెట్‌ రుసుము ప్రయాణికుడి కార్డు నుంచి కట్‌ అవుతుంది.

ప్రయాణికుడు నిర్ధారిత స్టేజీ వద్ద వెనక తలుపు నుంచి దిగినప్పుడు.. ప్రయాణించిన దూరానికి సరిపడా మొత్తాన్ని మినహాయించుకుని మిగతా మొత్తాన్ని తిరిగి ఆ కార్డులో జమ చేస్తుంది. ఎక్కడైనా ప్రయాణికులు వెనక డోర్‌ నుంచి బస్సు ఎక్కితే డ్రైవర్‌ దగ్గర ఉండే ఎర్ర లైటు వెలుగుతూ అలారం మోగుతుంది.  డెబిట్, క్రెడిట్, రూపే కార్డులు లేనివారు డ్రైవర్‌ వద్ద వివిధ విలువలో స్మార్ట్‌కార్డులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement