స్మార్ట్ ఫైట్ | Smart Fight | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఫైట్

Aug 27 2015 11:49 PM | Updated on Sep 28 2018 7:14 PM

స్మార్ట్ ఫైట్ - Sakshi

స్మార్ట్ ఫైట్

మెస్సేజ్‌లు ఇస్తే మీ నుంచి రిప్లై రావడం లేదు...

- స్మార్ట్ ఫోన్ కొనుక్కోండి: జిల్లా కలెక్టర్
- ఆర్డర్ పాస్ చేస్తే కొంటా: కోహీర్ ఎంపీడీవో బదులు
- కలెక్టరేట్‌లో లడాయి
- సమావేశాన్ని బహిష్కరించిన మండల అధికారులుమెస్సేజ్‌లు ఇస్తే మీ నుంచి రిప్లై రావడం లేదు.

 కోహీర్ ఎంపీడీవో  స్టీవెనీల్ చేయి పైకి లేపారు
కలెక్టర్: మీరో స్మార్ట్ ఫోన్ కొనుక్కోండి
స్టీవెనీల్:  వారం రోజుల్లో జీతం వచ్చాక కొనుక్కుంటా సార్
కలెక్టర్: దీనికి వారం ఎందుకు? డబ్బుల్లేకుంటే నేను ఇస్తా. తొందరగా ఫోన్ కొనుక్కోండి
స్టీవెనీల్: మీరెందుకు నాకు డబ్బులివ్వాలి. నాకు భిక్షం వేస్తున్నారా? కచ్చితంగా స్మార్ట్ ఫోన్ కొనుక్కొమ్మని ఒక సర్క్యులర్ ఇచ్చి ఆర్డర్ పాస్ చేయండి
కలెక్టర్: వాట్ ఆర్ యూ టాకింగ్.. ఫస్ట్ యూ గో అవుట్
స్టీవెనీల్: నేనెందుకు వెళ్లాలి. మీరేం మాట్లాడుతున్నారు?
... ఎంపీడీవోకు మద్దతుగా ఇతర ఎంపీడీవోలు సమావేశం బహిష్కరించి వెళ్లిపోయారు. పాలనపరమైన సౌలభ్యం కోసం ఒక్క స్మార్ట్ ఫోన్ కొనుక్కోమని చెప్పినందుకు ఎంపీడీవోలు హంగామా చేశారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగిన ఎంపీడీవోలు, డ్వామా ఏపీవోల సమీక్ష సమావేశంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం చర్చనీయాంశమైంది.  
 
అధికార వర్గాల్లో కలకలం
స్మార్ట్ ఫోన్ వివాదం అధికార వర్గాల్లో కలకలం రేపింది. మునుముందు జిల్లా యంత్రాంగం నుంచి ఇలాంటి ధిక్కారాలు కలెక్టర్ రోనాల్డ్‌రాస్‌కు ఇంకా ఎన్ని ఎదురు కానున్నాయో అని పలువురు చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు ఏడాది పాటు జిల్లా యంత్రాంగం ఇష్టారాజ్యం నడిచింది. అప్పటి ‘పెద్ద సార్’ క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే పనులు చక్కబెట్టేసే వారనే అపవాదు ఉంది. అప్పట్లో ఎవరికీ ఎవరిపై అజమాయిషీ, పర్యవేక్షణ లేకుండాపోయాయి. నిజానికి జిల్లా అత్యున్నత స్థాయి అధికారులంతా క్షేత్రాధికారులే. వారంలో కనీసం రెండు మూడుసార్లైనా పల్లెలను సందర్శించి, ప్రజల మాట వినాలి. సమస్యలు తెలుసుకోవాలి.

పరిష్కార మార్గాలు అన్వేషించాలి.. కానీ, ఉన్నత స్థాయి అధికారులంతా ప్రజలకు, పాలనకు దూరంగా గడిపారనే ఆరోపణలున్నాయి. కీలక శాఖల అధికారులంతా తమ సమయ పాలనను ‘అత్యున్నత స్థాయి అధికారి’ దినచర్యతో సెట్ చేసుకున్నారు. వాళ్లను చూసి సబార్డినేట్లు, వారిని చూసి క్షేత్రస్థాయి అధికారులు.. సిబ్బంది.. ఇలా ఏడాది పాటు ఆడింది ఆటగా కొనసాగింది. ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లాకు రూ.వేల కోట్ల నిధులు మంజారు చేసినా పనులు మాత్రం నత్తనడక నడిచాయి. కొత్త కలెక్టర్ వచ్చీ రావడంతోనే క్షేత్రస్థాయి పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. ఇన్నాళ్లూ కుర్చీలకు అతుక్కుపోయిన క్షేత్రస్థాయి యంత్రాంగం ఆయన వెంట పరుగులు తీయలేక.. ఇలా ధిక్కార స్వరం వినిపించనున్నారనేందుకు గురువారం నాటి ఉదంతం ఓ ఉదాహరణ అని కొందరు అధికారులు అంటున్నారు.    
 
ప్రజలే రక్షణ కవచం...
కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్‌రాస్ క్షేత్రస్థాయి పరిశీలనలతో అధికారులను హడలెత్తిస్తున్నారు. సమీక్షలు, సమావేశాల్లో వాస్తవ పరిస్థితికి, నివేదికలకు బేరీజు వేసి చూస్తున్నారు. తన వైఖరేమిటో ఆయన తన పనితీరు ద్వారా ఇప్పటికే అధికారులకు చూపించారు. ఇంతకాలం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఈ తీరును ఇముడ్చుకోలేక ఘర్షణ వైఖరిని చాటుతున్నారని కలెక్టరేట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, ప్రజలతో మమేకమవుతూ పనిచేస్తున్న కలెక్టర్‌కు ప్రజలు, ప్రజా సంఘాలే రక్షణ కవచంలా నిలుస్తారని పలువురు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement