కలెక్టరేట్: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటేచాలు.. సమస్త ప్రపంచం గుప్పిట్లో ఉన్నట్టే. ఆధునిక కాలంలో ఏది కావాలన్నా ఫోన్‌లోనే సెర్చ్ చేస్తున్నాం. ఒకప్పుడుసమాచార మార్పిడి అవసరాల కోసం మనం తెచ్చుకున్న టెక్నాలజీ.. ప్రస్తుతం అది లేకుండే ప్రపంచమే కాదు.. జీవితమే లేదన్నట్టు ప్రజలను తనకు బానిసలుగా మార్చేసుకుంది. అంటే మానవ అవసరాలను దాటిపోయి సెల్‌ఫోన్‌ను వదులుకోలేని పరిస్థితికితీసుకొచ్చేసింది. దీనివల్ల ఇప్పటి కాలంలో మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోందని చెప్పాలి. ముఖ్యంగా టీనేజ్ యువతను ఎక్కువగా ప్రభావితం చేసి చెడుదారిలోకి నెడుతోంది. దీంతో పెరుగుతున్న టెక్నాలజీని చూసి ఆనందపడాలో.. జరుగుతున్న పరిణామాలను చూసి భయపడాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నామని విజ్ఞులు చెబుతున్నారు.
ఫేస్‌బుక్కూ ప్రమాదకరమే..!
ఇప్పటి కాలంలో ఫేస్‌బుక్ అకౌంట్ లేనివారు దాదాపు ఉండరనే చెప్పొచ్చు. తాజాగా ‘యూనివర్సిటీ ఆఫ్ సర్రే’(ఇంగ్లండ్) నిర్వహించిన అధ్యయనంలో ఫేస్‌బుక్ వినియోగానికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా ప్రొఫైల్స్, పోస్టుల్లో చూసే వ్యక్తులు, పోస్టులను చూసి పలువురు ఇతరులతో తమని తాము పోల్చుకోవడం ఎక్కువవుతోందని తేల్చింది. దీంతో పరోక్షంగా ఒత్తిడికి గురవుతున్నారని పరిశోధకులు ప్రకటించారు. పైగా ఫేస్‌బుక్ వినియోగించే వారిలో ఎక్కువగా నిద్ర సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తించారు. వారికి తెలియకుండానే కండరాల ఒత్తిడికి లోనవుతున్నాయట. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు తమను తాము ఇతరులతో పోల్చుకోవడం వల్ల వారితో పోటీ పడడం కోసం ఆందోళనకు గురవడం, లేదా తమని తాము తక్కువ చేసుకుంటూ డిప్రెషన్‌కు గురవుతున్నారని ఆ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు.
ఇంస్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లు ఒక వ్యక్తికి సంబంధించిన లోపాలను పక్కనపెట్టి వారిని చాలా గొప్పగా చూపించేందుకు వేదికలుగా మారుతున్నాయని, దాంతో సంబంధిత వ్యక్తుల ఫ్రెండ్ లిస్ట్, ఫాలోయర్స్‌గా ఉన్నవారు వారి ప్రభావంతో తెలియకుండానే ఒత్తిడికి లోనవుతున్నారట. అధిక శాతం మంది ఒక పోస్ట్ చేసిన తర్వాత దానికి వచ్చే లైక్‌ల కోసం చాలా సమయం మిగతా పనులు పక్కన పెట్టి వేచి చూస్తూ ఉన్నారట. ఇతరులు లైక్ కొట్టినప్పుడు, వారు మనకు ఆత్మీయులని గుడ్డిగా నమ్మేస్తున్నారని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఫేస్‌బుక్ వల్ల ‘సోషల్’ బంధాలు మెరుగుపడడం అటుంచి.. వ్యక్తుల మధ్య తెలియని ఆగాధాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. వాస్తవానికి ఇలాంటి అధ్యయనాలు తరచు వెలుగులోకి వస్తున్నా ఎవరికి వారు తాము తమ కంట్రోల్లోనే ఉన్నామని గుడ్డిగా నమ్మి చాలామంది వాటిని లైట్‌గా తీసుకుంటున్నారు.
‘యాప్స్’తో చైనా దండయాత్ర
చైనాకి చెందిన ‘టిక్‌టాక్’ యాప్ వచ్చిన తర్వాత ఇండియాలో కొంత మొత్తంలో యూట్యూబ్ వినియోగం తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే టిక్‌టాక్‌కు ‘షేర్‌చాట్’ అప్లికేషన్ గట్టి పోటీనిస్తోంది. ఈ రెండు మాత్రమే కాదు.. ఇటీవల కాలంలో చైనా అప్లికేషన్స్ డెవలపర్లు భారత వినియోగదారుల నాడిని పసిగట్టి పెద్ద మొత్తంలో సరికొత్త యాప్స్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో వదులుతున్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి భారతీయులు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకుని వాడుతున్న చాలా వరకు అప్లికేషన్లు చైనా డెవలపర్లు రూపొందించినవే కావడం గమనార్హం. 2018లో ఇండియాలో బాగా పాపులర్ అయిన 10 అప్లికేషన్లను పరిశీలిస్తే, వాటిలో ఐదు చైనావే. గూగుల్ ప్లేస్టోర్‌లో టాప్ 100 అప్లికేషన్లలో 44 చైనాకు చెందినవే కావడం గమనార్హం.
ఇవి చాలాపాపులర్
ఏదైనా తమకునచ్చితే నెత్తిన పెట్టుకోవడం భారతీయులకు అలవాటు. ఇండియాలో బాగా పాపులర్ అయిన చైనీస్ అప్లికేషన్లలో ‘టిక్‌టాక్’ మొదటి స్థానంలో ఉంది. 2018లో గూగుల్ ప్లేస్టోర్‌లో మొదటి స్థానం సాధించిన అప్లికేషన్ ఇది. దీని దెబ్బకి వాట్సప్ రెండో స్థానానికి పడిపోయింది. మళ్లీ మూడు, నాలుగు స్థానాల్లో చైనాకే చెందిన ‘లైక్, షేర్ ఇట్’ యాప్స్ ఉన్నాయి. 8వ స్థానంలో చైనా ‘హల్లో’ యాప్, 9వ స్థానంలో అదే దేశానికి చెందిన ‘టూగెట్‌యూ’ నిలిచాయి.
ఎలా టార్గెట్‌చేస్తున్నారు?
ప్రపంచంలో చైనా తర్వాత అతి పెద్ద మార్కెట్ ఇండియాదే. ఆ విషయం చైనా డెవలపర్లకు బాగా తెలుసు. అందుకే భారతీయ వినియోగదారులు ఎలాంటి కంటెంట్ ఇష్టపడతారో నాడిని పసిగట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. చైనా అప్లికేషన్ డెవలపర్లు తయారు చేసే యాప్స్ ఆకర్షణీయమైన యూజర్ ఇంటర్‌స్పేస్‌తో ఉంటాయి. దీంతో మన వినియోగదారులు ఆ యాప్ ఏ దేశానికి చెందింది.. ఎలాంటి సెక్యూరిటీ లోపాలు ఉన్నాయనేవి ఏమీ గమనించకుండా యథేచ్ఛగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. చైనాకు చెందిన ‘క్లీన్‌మాస్టర్’ వంటి కొన్ని యాప్స్‌లో ప్రమాదకరమైన కోడ్ ఉన్న విషయం వెలుగులోకి రావడం తెలిసిందే.
పిచ్చిపరాకాష్టకు..
‘తేరా గాటా మేయిన్ కుచ్ నహి జాతా’ అనే హిందీ పాటను అనుకరించి నలుగురు యువతులు చేసిన వీడియో శృష్టించిన ప్రభంజనం అంతా, ఇంతా కాదు. దేశ సరిహద్దులను దాటి మరీ ఈ విడియో విమర్శలను మూటగట్టుకుంది. మంచి కుటుంబానికి చెందిన యువతుల కుటుంబాలను ‘నెట్టు’కీడ్చింది. మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో తెలియని పిచ్చి వెర్రితో చేస్తున్న వింత ప్రయోగాలు చాలా మంది బుతుకులను ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ఇన్ని ఇబ్బందులను సృష్టించి మానవ సంబంధాలను దెబ్బతీసే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment