హిమాయత్‌నగర్ : నచ్చిన పాట పాడాలని, వచ్చిన డైలాగ్ చెప్పాలని ఎవరికైనా ఉంటుంది.. నలుగురు మన కళను మెచ్చుకుంటూ ఇంకా ఆనందంగా ఉంటుంది.. అయితే బెరుకు, భయం మనలను ఆ పనిచేయనివ్వవు.. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. టెక్నాలజీ పుణ్యమా అని అందరూ తమలోని గాయకుడిని, నటుడిని బయటకు తీస్తున్నారు. డబ్‌స్మాష్‌తో అదరగొడుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సప్‌లలో వీడియోలతో హల్చల్ చేస్తున్నారు. ఇలా డబ్‌స్మాష్ చేసేందుకు యూత్ ఇటీవల టిక్..టాక్ యాప్‌ను ఎక్కువగా వాడుతున్నారు. దీనిలో కేవలం 30 సెకెండ్ల నిడివి గల పాటలు, డైలాగ్‌లు ఉంటాయి. మనకు నచ్చిన సినిమా, డైలాగ్ పేరును సెర్చ్‌లో కొడితే క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. దీంతో పాటు డబ్‌స్మాష్, లైక్ యాప్‌లు సైతం అందుబాటులో ఉన్నాయి. నచ్చిన డైలాగ్, పాటని ఫోన్‌లో అచ్చు సినిమాలో హీరో, హీరోయిన్ చెప్పినట్లు చెబుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
సెలబ్రిటీలను మించిపోతున్నారు
నేటి యువత తమ టాలెంట్‌ని పలు విధాలుగా నిరూపించుకుంటున్నారు. స్కూల్ పిల్లలు మొదలు పెద్ద వయస్సు ఉన్న వారు సైతం తమకు నచ్చిన డైలాగ్, సాంగ్‌ని వీడియోల రూపంలో చేస్తూ స్నేహితులను అలరిస్తున్నారు. సినిమాల్లో హీరోయిన్స్ చెప్పిన డైలాగ్‌లకు అమ్మాయిలు, అబ్బాయిలు ఫిదా అవుతుంటారు. నచ్చిన హీరోయిన్ ఎలా చెప్పిందో..అదే రీతిలో డైలాగ్ ఎక్స్‌ప్రెషన్‌ను డబ్‌స్మాష్‌ల ద్వారా చూపి స్తూ సెలబ్రిటీల కంటే తామేమీ తక్కువ కాదం టూ నిరూపించుకుంటున్నారు అమ్మాయిలు.
ఇదే మంచి చాన్స్
నేను.. చిన్న చిన్న షార్ట్‌ఫిల్మ్‌లలో నటిస్తున్నాను. మోడల్‌గా రాణించాలనుకుంటున్నాను. నన్ను నేను ఎప్పటికప్పుడు నటనలో అప్‌డేట్ చేసుకోవడానికి మ్యూజికల్లీ, వియూ, డబ్‌స్మాష్ మొదలైన యాప్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. – నిషా, మోడల్
నాలో కొత్త యాంగిల్ చూస్తున్నాను
ఇన్నాళ్లూ.. నేను కేవలం ఫ్రెండ్స్‌తో మాట్లాడితే చాలని అనుకునేదాన్ని. పాటలు వినడమే తప్ప.. వాటిని పాడాలి, డైలాగ్స్ చెప్పాలన్న ఆలోచన ఉండేది కాదు. మా ఫ్రెండ్స్ వీటిని ట్రై చేసి నాకు వాట్సప్ చేసినప్పుడు నాకూ ఇంట్రెస్ట్ పెరిగింది. మ్యూజిక్‌ని ట్రై చెయ్యడం ప్రారంభించాను. ఇప్పుడు నాలో కొత్త యాంగిల్ చూస్తున్నాను. – రూత్ ప్రియాంక, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
రోజూ డబ్‌స్మాష్ చెబుతా
నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. సినిమాల్లో పాటలు వినేదాన్ని. ఇప్పుడు కొత్త కొత్త యాప్స్ వల్ల పాటలు పాడటమే కాదు.. నచ్చిన డైలాగ్స్‌ను డబ్ స్మాష్‌లా చెబుతూ.. ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ వాటిని చూసి అభినందిస్తుంటే.. ఆనందం అంబరాన్ని తాకుతోంది. – కళ్యాణి, పీహెచ్‌డీ స్కాలర్
బోర్ కొడితే టిక్‌టాక్ ఉందిగా
నాకు బోర్ కొడితే చాలు వెంటనే టిక్‌టాక్ యాప్‌ని ఓపెన్ చేస్తా. ఇష్టమైన డైలాగ్, సాంగ్ పాడి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తా. అంతే లైకులే లైకులు. ఇప్పటి వరకు నేను కొన్ని వందల డబ్‌స్మాష్‌లు చెప్పాను. – ప్రియాంక, మిస్ తెలంగాణ
మొదట్లో వచ్చేది కాదు
మొదట్లో పాట, డైలాగ్ సరిగ్గా వచ్చేది కాదు. కాస్త బెరుకుగా ఉండేది. ఒక పది, పదిహేను వీడియోలు చేశాక అలవాటైపోయింది. ఇప్పుడు డబ్‌స్మాష్, మ్యూజికల్లీ యాప్స్ ద్వారా ఇంట్లోనే పాటలు, మాటలు డబ్బింగ్ చెబుతున్నట్లుగా రోజూ క్రియేట్ చేసుకుంటున్నా. – రినీగ్రేస్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
Comments
Please login to add a commentAdd a comment