
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో ఓ పౌరుడు చిత్రీకరించిన వీడియో పోలీసులకు దర్యాప్తులో బాగా ఉపయోగపడింది. ఫలితంగా నేరస్తుడిని గంటల్లో పట్టుకోగలిగారు. నల్లగొండలో తమపై దాడి జరిగిందని ఓ వృద్ధురాలు డీజీపీకి పోస్టు చేసిన ఓ వీడియో కలకలం రేపింది. దానిపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. ‘ప్రతీ పౌరుడు యూనిఫారం లేని పోలీసే’అన్న నానుడిని చాలామంది పాటిస్తున్నారు.
రాష్ట్రంలో 33 జిల్లాల్లో బాధ్యత గలిగిన పలువురు ఎక్కడ ఎలాంటి ఉల్లంఘన జరిగినా, సమస్య ఎదురైనా వాటిని షూట్ చేసి, తెలంగాణ పోలీసులకు సోషల్‌మీడియా ద్వారా చేరవేస్తున్నారు. ఇదే సోబెటరంటూ ఆధునిక సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నేరుగా చేసే ఫిర్యాదుతో సమానంగా సోషల్ మీడియా వాటిపై కూడా పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. పైగా అవి అందరికీ కనిపించే వీలుండటంతో ఉన్నతాధికారులు సైతం దాని గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఫలితంగా అవి చాలామటుకు వెంటనే పరిష్కారమవుతున్నాయి. తీవ్రమైన కేసుల్లో మాత్రం ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు.
ఫలిస్తోన్న తెలంగాణ పోలీసుల కృషి..
ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరాలను నియంత్రించడంలో దేశంలోనే నెం.1గా ఉన్న తెలంగాణ పోలీసులు సోషల్ మీడియానూ విస్తృతంగా వాడుకుంటున్నారు. స్మార్ట్ వినియోగం పెరుగుతున్న దరిమిలా.. ఆన్‌లైన్ ఫిర్యాదులపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. డీజీపీ ఆఫీసు నుంచి స్థానిక ఠాణా వరకూ సోషల్ మీడియాలో ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, హాక్ ఐ ద్వారా రోజురోజుకు ఇవి పెరుగుతున్నాయి. ఒక్క హాక్ ఐ ద్వారానే 1.50 లక్షల ఫిర్యాదులు అందగా, వాట్సాప్ 14వేలు, ఫేస్‌బుక్ ద్వారా మూడువేలు, ట్విట్టర్ ద్వారా 4,500 ఫిర్యాదులు అందాయి. లక్షలాదిమంది పోలీసులు రూపొందించిన ఫేస్‌బుక్ పేజీలను, ట్విటర్‌ఖాతాలను అనుసరిస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఇంటికే వచ్చి ఫిర్యాదులు తీసుకుంటుండటం గమనార్హం
వాట్సాప్ ద్వారా..
సంవత్సరం: 2019
వచ్చిన ఫిర్యాదు: 14,185
ఎఫ్.ఐ.ఆర్ రిజిష్టర్డ్: 578
నమోదైన పెట్టీ కేసులు: 237
ఫేస్‌బుక్ ద్వారా...
సంవత్సరం: 2019
వచ్చిన ఫిర్యాదులు: 3,093
పెట్టీకేసులు: 16
ట్విట్టర్ ద్వారా..
సంవత్సరం: 2019
వచ్చిన ఫిర్యాదులు: 4598
నమోదైన ఎఫ్.ఐ.ఆర్‌లు: 89
పెట్టీకేసులు: 37
Comments
Please login to add a commentAdd a comment