ఆర్డీఓ సూరజ్‌కుమార్‌ను వేడుకుంటున్న వృద్ధురాలు
చౌటుప్పల్ : తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తిని కుమారుడు తన పేరిట చేయించుకున్నాడు.. ఇప్పటికే తండ్రి చనిపోగా వృద్ధాప్యంలో ఉన్న తల్లికి బుక్కెడు బువ్వ పెట్టేందుకు నానాయాగి చేస్తున్నాడు. సూటిపోటి మాటలతో హింసిస్తున్నారు. కాలు విరగడంతో లేవలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిని కుమారుడు ఏమాత్రం పట్టించుకోకపోగా, ఆయన భార్య సైతం చీదరించుకుంటుంది. మనువడు కూడా తల్లిదండ్రు ల మద్దతుతో నానమ్మపై భౌతికదాడులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం ఇంటినుంచి బయటకు వచ్చిన వృద్ధురాలు గ్రామస్తుల వద్ద చేయిచాచి పూట గడుపుకుంది. ఈ క్రమంలో కుమార్తెను తీసుకొని మంగళవారం ఆర్డీఓ సాల్వేరు సూరజ్‌కుమార్‌ను సంప్రదించింది. ఆర్డీఓ సత్వరమే స్పందించి వృద్ధురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన సుర్కంటి రాంరెడ్డి–సత్తమ్మ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరికి వివాహాలయ్యాయి. సుమారు ఏడేళ్ల క్రితం రాంరెడ్డి చనిపోగా, సత్తమ్మ(75) కుమారుడు మల్లారెడ్డి వద్ద ఉంటోంది. తండ్రి చనిపోయిన రెండేళ్ల తర్వాత అతని పేరిట ఉన్న మూడెకరాల వ్యవసాయ భూమిని కుమారుడు తన పేరిట పట్టా మార్చుకున్నాడు. ఆ సమయంలో తల్లి సత్తమ్మకు 30వేల రూపాయల నగదు ఇచ్చాడు. కొంత కాలం తర్వాత తల్లి వద్ద ఉన్న ఆ నగదును తీసుకున్నాడు.
తల్లికి మంచినీళ్లు తాగిపిస్తున్న కుమార్తె
ప్రస్తుతం సత్తమ్మకు వృద్ధాప్య పెన్షన్ వస్తుండడంతో పూట గడుపుకుంటోంది. రెండేళ్ల క్రితం సత్తమ్మకు కాలు విరగడంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆ సమయంలో కుమారుడు, కోడలు, మనుమడు కనీసం మందలివ్వలేదు. సపర్యలన్నీ కుమార్తె ప్రేమలతే చేసింది. ఇటీవల కొడుకు, కోడలు, మనువడి నుంచి చీదరింపులు, భౌతికదాడులు మొదలయ్యాయి. ఆ క్రమంలో ఐదు రోజుల క్రితం మనుమడు సత్తమ్మపై చేయి చేసుకున్నాడు. మనస్తాపం చెందిన వృద్ధురాలు ఇంటినుంచి బయటకు వచ్చి గ్రామస్తుల వద్ద అడుక్కొని పూట గడుపుకుంది. స్థానికుల ద్వారా తెలుసుకున్న సమాచారంతో కుమార్తె ప్రేమలతను తీసుకొని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గుత్తా వెంకట్‌రెడ్డిని సంప్రదించింది. ఆమె కు ఆయన అల్పహారం, భోజనం సమకూర్చారు. అనంతరం విషయాన్ని ఆర్డీఓ సాల్వేరు సూరజ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఆర్డీఓ.. కుమారుడిని కార్యాలయానికి పిలిపించారు. తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించడం మానుకోకుంటే భూమిపట్టా రద్దు చేయిస్తామని హెచ్చరించారు. నాయనమ్మపై చేయి చేసుకుంటే స్థానిక కంపెనీలో పని చేసే మనువడు సునీల్‌రెడ్డి ఉద్యోగం తీయిస్తామన్నారు. స్పందించిన కుమారుడు మల్లారెడ్డి మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకుంటామని హామీ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment