హుస్నాబాద్‌లో నిర్వహించిన ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న ఎంపీ సీతారాంనాయక్
సాక్షి, హుస్నాబాద్: 67 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో గిరిజనుల్లో ఏలాంటి మార్పు రాలేదని, మళ్లీ ఓట్లకోసం తండాలకు ఏ ముఖం పెట్టుకోని వస్తారని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో గిరిజనుల ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎంపీ సీతారాంనాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ పాలనలో రాష్ట్రంలో 1.80 మంది గిరిజనులపై గుడుంబా కేసులు పెట్టారని, ఇందులో లక్ష మంది చనిపోయారన్నారు. మహాకూటమి దొంగ కూటమని, కోదండరాంను కూటమిలోకి రమ్మని టికెట్ల కోసం వార్‌రూం, స్క్రీనింగ్ కమిటీల చుట్టూ తిప్పుతున్నారని, ఏ రూంకు పోయిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఓడించలేదని అన్నారు. గిరిజనులకు 9శాతం రిజర్వేషన్లు కావాలని కోరామని, అందుకు వ్యతిరేకంగా 198 కేసులు వేశారని అన్నారు. 50శాతం రిజర్వేషన్లుకు మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
గోరుగోలి భాష మాట్లాడమే గొప్పతనం..
లంబాడిలీలు మాట్లాడే భాష గోరుగోలి భాష అని, ఆ భాష మాట్లాడటం గిరిజనుల గొప్పతనమని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన, ఏ దేశానికి వెళ్లిన లంబాడీల జాతి ఒక్కటే గోరుగోలి భాష మాట్లాడుతారన్నారు. మా దైవమైన సేవాలాల్ మహారాజ్ కొరుకున్న మా జాతిలో మార్పు రావాలంటే కేసీఆర్‌ను సీఎం, ఎమ్మెల్యేగా సతీష్‌కుమార్‌ను గెలిపించుకుంటేనే ఆ కల నిజమైతదని సీతారాంనాయక్ గిరిజనులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రూప్‌సింగ్, కర్ర శ్రీహరి, రాష్ట్ర నాయకులు పేర్యాల రవీందర్‌రావు, ఎంపీపీ భూక్య మంగ, భీమదేవరపల్లి జెడ్పీటీసీ రామచంద్రంనాయక్, మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ బీలునాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎడబోయిన తిరుపతిరెడ్డి, పేర్యాల దేవేందర్‌రావు, గిరిజన సంఘాల నాయకులు తిరుపతినాయక్, తదితరులున్నారు.
వడ్డెర బతుకులు మారబోతాయి..
హుస్నాబాద్‌రూరల్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధిలో ముందుకు సాగుతుందని, బీడు భూములకు గోదావరి జలాలను తెచ్చేందుకు రాత్రిబవళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. మంగళవారం మీర్జాపూర్ క్రాసింగ్ శుభం గార్డెన్‌లో నిర్వహించిన ఒడ్డరుల ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత పాలకుల కాలంలో వడ్డెరులు పేదరికంలో మగ్గెవారన్నారు. నిలువ నీడ లేక, పిల్లలను చదివించుకోనే ఆర్థిక స్థోమత లేక బండ రాళ్లను పిండి చేసే శక్తి ఆ దేవుడు ఇస్తే వారి బతుకులు మార్చే పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి గొప్ప పనులు చేసే సీఎం కేసీఆర్‌ను గద్దె దించుటకు కొందరు దళారులు కూటమి కట్టి మీ ముందుకు వస్తున్నారని మహాకూటమి నాయకులకు వడ్డెరుల గన్ను దెబ్బ ఏట్లా ఉంటుందో చూపించాలన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఒడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దండుగుల రాజ్యలక్ష్మి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్, బొంత సమ్మయ్య, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment