సాక్షి, సిటీబ్యూరో : ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ ఇప్పుడు అనన్య సామాన్య విజయాలు సాధిస్తోంది. విభిన్న రంగాల్లో రాణిస్తోంది. అయినప్పటికీ వంటింటిపై తన పట్టు కోల్పోలేదని ఇప్పటికీ నిరూపిస్తోంది. పురుష చెఫ్స్ రాజ్యమేలుతున్న ఆహార పరిశ్రమలో శరవేగంగా పుంజుకుంటున్నారు ఇంటింటా చేయి తిరిగిన మహిళా చెఫ్స్. గడప దాటకుండానే వీరు నమోదు చేస్తున్న గణనీయమైన విజయాలు ఫుడ్ ఇండస్ట్రీలో రానున్న మహిళాధిపత్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరానికి చెందిన పలువురు అతివలు తమ మనోగతాలను ఇలా పంచుకున్నారు.
చదువుకునే సమయంలో కూడా ఎప్పుడూ జాబ్ చేయాలనుకోలేదు. 12వ తరగతిలో ఉండగా హాబీగా బేకింగ్ అలవాటైంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి గిఫ్ట్ ఇచ్చేదాన్ని. అలా అది ఆర్డర్లపై తయారు చేసి ఇచ్చేవరకూ వెళ్లింది. ఆ తర్వాత 2017 నవంబరు నుంచి ఫుల్‌టైమ్ ప్రొఫెషన్‌గా మారింది. ప్రస్తుతం ఇంట్లో నుంచే ఆర్డర్స్ తీసుకుంటున్నాను. హైటెక్ సిటీలో నిర్వహించిన గ్రేట్ ఇండియా బేక్ షో, మాస్టర్ చెఫ్ ఆడిషన్స్‌లోనూ పార్టిసిపేట్ చేశా. బేకింగ్‌లో ఆసక్తి ఉన్న యువతకు ఉదయం సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా టీచింగ్ ఇస్తున్నా. ఇప్పటిదాకా 120 విద్యార్థులకు టీచ్ చేశా. వారిలో కొందరు బేకరీలు కూడా ప్రారంభించారు. బేకింగ్‌తో పాటు కుకింగ్ కూడా చేస్తున్నా. మా అమ్మ, నాన్న అన్నివిధాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మనం నైన్ టు ఫైవ్ జాబ్‌లకు పరిమితం కాకూడదని దృఢంగా నిశ్చయించుకుంటే తప్పకుండా మహిళలు తమని తాము ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దుకోవచ్చు.
– దీపిక, కూకట్‌పల్లి
అభి‘రుచి’కి రిటైర్మెంట్ లేదు...
వారాంతాల్లో హైదరాబాద్‌లో జరిగే చిన్న చిన్న ఎగ్జిబిషన్లు, చేనేత సంత వంటి వాటిల్లో రుచికరమైన పొడులను వినియోగదారులకు విక్రయిస్తుంటాను. కార్పొరేట్ ఆఫీసులోని అడ్మిన్ విభాగంలో 30 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి రిటైరయ్యా. ఓ కూతురు, కొడుకు ఉన్నారు. పిల్లలిద్దరూ సెటిలయ్యారు. భర్త దూరమై, రిటైర్ అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నా. నాకు వంట అంటే ఇంకా ఇష్టం నావంట మా బంధుమిత్రులకు బాగా ఇష్టం. అందుకే దాన్నే ఎంచుకున్నా. ‘కంచి కిచెన్స్’ పేరుతో సాంబార్ పొడి, దోసపొడి, మిర్చి పొడి, పులిహోర మిక్స్.. ఇలా బామ్మల కాలంలో నాటి వంటకాలను తయారు చేస్తున్నా. డబ్బుల కోసం కాదు. కానీ.. ఏదో కోల్పోయిన భావన రాకూడదనే తపన. మా పిల్లలు, మనవరాళ్లు, బంధువులు ఇంకా ఏం వర్క్ చేస్తావు, విశ్రాంతి తీసుకోకుండా’ అంటున్నా.. కూడా ‘ఈ పనిని ఎంజాయ్ చేస్తున్నాను ఏ రోజు ఒత్తిడిగా అనిపించినా అప్పుడు మానేస్తాను’ అని చెబుతుంటాను. ఇప్పుడు మా అబ్బాయి కూడా నాకు మార్కెటింగ్‌లో హెల్ప్ చేస్తుంటాడు.
– విజయ శ్రీనివాసన్, మారేడుపల్లి
బ్లాగుతో బాగు..
కొత్త కొత్త రుచులు ఆస్వాదిస్తూ ఫుడీగా ఉండేదాన్ని. ఆ అనుభవాలని ఓ కాలేజ్ మేగజైన్‌కి రాసేదానిని. ఆ తర్వాత ఫ్రెండ్ అడిగితే బ్లాగ్‌కి హెల్ప్ చేశా. ఆ తర్వాత కొందరు నువ్వే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అడిగారు. అలా రెండున్నరేళ్లుగా ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నా. త్వరలో ఫుల్ టైమ్ బ్లాగర్ అవుతాను. ప్రతి రోజూ తప్పకుండా హైదరాబాద్ ఫుడ్ ట్రిప్ పేజ్‌లో ఒక్క ఫుడ్ ఐటమ్ అయినా అప్‌లోడ్ చేస్తాను. నేను పోస్ట్ చేసిన వావ్ ఆమ్లెట్ వీడియో కి ఏకంగా లక్షా 30వేల వ్యూస్ వచ్చాయి. స్ట్రీట్ ఫుడ్, లేదా స్టార్ హోటల్ ఫుడ్ అని కాకుండా అన్నీ కవర్ చేస్తున్నా. రోజుకు కనీసం 30, 40 మెంబర్లు మెసేజ్‌లు పెడుతుంటారు. అందరికీ రెస్పాన్స్ ఇస్తుంటాను.
– సృష్టి లాడేగం, కూకట్‌పల్లి
మా నాన్‌వెజ్.. క్రేజ్
14 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉండాను. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కోసం చేస్తుంటాను. పిల్లలు ఐటీ ఫీల్డ్‌కి నా ఫుడ్‌ని తీసుకెళుతుంటారు. పదేళ్ల నుంచి ఇది ప్రొఫెషనల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో రెండేళ్ల నుంచి మామ్స్ హోమ్ మేడ్ ఫుడ్ బై జరీనాషా అనే పేరుతో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యాను. బిర్యానీ, హలీం, పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌గా తినే పాయా, నెహారీ, బోటీ... మటన్ మరగ్ వంటివన్నీ తయారు చేస్తాను. కిచెన్‌లో 18 మందికి ఉద్యోగం ఇవ్వగలిగాను. నా దగ్గర 6 పేజీల మెనూ ఉంది. చికెన్ స్టార్టర్స్, ఫిష్, మటన్ బిర్యానీ, హలీం రెగ్యులర్‌గా ఉంటుంది.
– జరీనా షా, టోలిచౌకి
పచ్చడి.. పొడి..
ఎమ్మెస్సీ మైక్రోబయోలజీ చేశాను. ప్రొఫెసర్‌గా, టీచర్‌గా చేశాను. ఒకసారి ఇంట్లో ఆవకాయ పికిల్ తయారు చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే ఎవరో మాకూ కావాలని అడిగారు. చేసి ఇచ్చాను. అక్కడ మొదలై.. దీంతో అదే బిజినెస్‌గా మారిపోయింది. తొలుత వారాంతంలో మాత్రమే చేస్తుండేదాన్ని. ఆ సమయం సరిపోలేదు. ఆ తర్వాత నా భర్త పవన్‌కుమార్ కూడా తన ఐటి ఉద్యోగం మానేసి నాతో చేయి కలిపారు. పచ్చళ్లు, పొడులు, స్వీట్లు, స్నాక్స్ తయారు చేస్తాం. అన్నీ కలిపి 30 ఐటమ్స్ దాకా ఉంటాయి. సమ్మర్‌లో ఆవకాయ, బెల్లం ఆవకాయ, తొక్కు పచ్చడి అలాగే వింటర్‌లో నిమ్మకాయ, ఉసిరి, చింతకాయ, దబ్బకాయ.. ఇలా సీజనల్ పికిల్స్ అందిస్తున్నాం. నాలుగేళ్ల నుంచీ చేస్తున్నా. పికిల్స్ అండ్ పొడీస్ పేరుతో కేవలం ఫేస్‌బుక్ పేజ్ ద్వారా మాత్రమే నా బిజినెస్ సాగుతోంది.
– దీప్తి ఆకెళ్ల, దిల్‌సుఖ్‌నగర్
టేస్టీగా.. వెరై‘టీ’గా..
వ్యక్తిగతంగా టీ ప్రియురాల్ని. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రీన్ టీ తాగేదాన్ని. అయితే అది టేస్ట్‌గా అనిపించేది కాదు. ఆరోగ్యకరమైన టీ.. టేస్టీగా లభించడం లేదనే విషయం అప్పుడే అర్థమైంది. దాంతో విభిన్న రకాల టీ పౌడర్స్ గురించి స్టడీ చేశాను. వాటిని దిగుమతి చేసుకుని సిటీలో కేఫ్స్, రెస్టారెంట్స్‌కి అందించడం మొదలుపెట్టాను. నేను అందిస్తున్న టీ వెరైటీలు కేవలం రుచికరంగా మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తాయి.
– విద్య, కూకట్‌పల్లి
Comments
Please login to add a commentAdd a comment