రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి : భట్టి
‘సాక్షి’కి అభినందనలు
భట్టిని కలసిన ఓయూ జేఏసీ నేతలు
హైదరాబాద్: అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. గాంధీభవన్‌లో సోమవారం జరిగిన కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమల్లో సమస్యలపై ఈ సందర్భంగా చర్చించినట్టుగా ఆయన చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఉద్యమించాల్సిన అవసరముందనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పారు. టీఆర్‌ఎస్ మాటలకు, హామీలకే పరిమితమైందని విమర్శించారు. ఈ సమావేశానికి ఎం.కోదండ రెడ్డి అధ్యక్షత వహించగా కాంగ్రెస్ సీనియర్ నేతలు బలరాం నాయక్, డి.శ్రీధర్‌బాబు, దాసోజు శ్రవణ్, మల్లు రవి, అద్దంకి దయాకర్, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల సమస్యలపై ‘సాక్షి’ సోమవారం ప్రచురించిన కథనానికి కాంగ్రెస్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, ఎం.కోదండ రెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ప్రత్యేకంగా అభినందనలను తెలిపారు. ‘సాక్షి’ కథనం విశ్లేషణాత్మకంగా, పక్కా సమాచారంతో ఉందన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓయూలో పర్యటించేలా చూడాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కను ఓయూ జేఏసీ నేతలు కోరారు. గాంధీభవన్‌లో భట్టిని సోమవారం ఓయూ జేఏసీ నేతలు పున్నా కైలాష్ నేత, కె.విజయకుమార్, లోకేష్‌యాదవ్, శ్రీధర్‌గౌడ్ తదితరులు కలిశారు.