ఆరోగ్యానికి వాక్‌వే! | Special Garden Design By GHMC In Hyderabad | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి వాక్‌వే!

Published Wed, Dec 11 2019 5:03 AM | Last Updated on Wed, Dec 11 2019 5:03 AM

Special Garden Design By GHMC In Hyderabad - Sakshi

మట్టిపై నడక, రోడ్డుపై నడక, బీచ్‌ ఇసుకలో నడక.. ఇలా ఎన్నో చూశాం. కానీ ఒకేసారి రాళ్లు, ఇసుక, ఒండ్రుమట్టిపై వాకింగ్‌ చేయడం చూశారా?. ఇకపై ఇలాంటి వాకింగ్‌కు వేదిక కానుంది ఇందిరాపార్కు. మామూలు నడకే కాదు.. ఓ థెరపీలా వాకింగ్‌ ఉండాలని ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిజియోథెరపీ, ఆక్యుప్రెషర్‌ మాదిరిగా శరీరానికి సాంత్వన నిచ్చేలా ఈ ఏర్పాటు ఉంటుందని జీహెచ్‌ఎంసీ బయోడైవర్సిటీ అధికారులు చెబుతున్నారు. అందుకే దీనిని ‘థెరప్యూటిక్‌’గార్డెన్‌ అని కూడా వ్యవహరిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్‌

ఏర్పాటు చేస్తారిలా... 
ఈ పార్కులో కాఠిన్యం నుంచి సున్నితత్వం దిశగా ఎనిమిది వరుసలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వరుసలో 20 ఎంఎం కంకర, మరో వరుసలో 10 ఎంఎం కంకర.. ఇలా మొత్తం 8 వరుసల్లో గులకరాళ్లు, లావు ఇసుక, సన్నని ఇసుక, చెట్టు బెరడు, ఒండ్రుమట్టి, నీరు ఏర్పాటు చేస్తారు. వలయాకారంగా, జిగ్‌జాగ్‌గా, 8 ఆకారంలో నడిచే ఏర్పాట్లుంటాయని.. ఎన్ని విధాలుగా నడవొచ్చో, ఎలా నడిస్తే కలిగే మేలేంటో సైన్‌ బోర్డుల ద్వారా సూచిస్తామని జీహెచ్‌ఎంసీ బయోడైవర్సిటీ విభాగం అడిషనల్‌ కమిషనర్‌ కృష్ణ తెలిపారు. వలయాకారంలో నిర్మించే ఈ వాక్‌వేలో ఒకేసారి ఐదారుగురు నడిచేందుకు వీలుంటుందన్నారు.

ప్రయోజనం ఇదీ...
కాలికి ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఒక వరుస నుంచి ఇంకో వరుసలోకి నడిస్తే ఆరోగ్య రీత్యా ప్రయోజనకరం. ఈ వాక్‌వేలో నడవడం వల్ల కఠినమైన ఉపరితలం నుంచి మృదువైన భాగానికి సాగే నడకతో రక్త ప్రసరణ మెరుగై కొత్త అనుభూతి కలుగుతుంది. ఆక్యుప్రెషర్, ఫిజియోథెరపీతో కలిగే ప్రయోజనల్లాగే దీంతో కూడా పలు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. నడిచే దూరం తక్కువే అయినా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఆయా డైరెక్షన్లలో నడక ద్వారా ప్రకృతి వైద్యం అందుతుంది. షుగర్, బీపీ పెరగకుండా కూడా వీటి ద్వారా ప్రయోజనం ఉంటుంది.

అంచనా వ్యయం రూ.15 లక్షలు.. 
ఈ గార్డెన్‌లోని వాక్‌వే చుట్టుపక్కల ఉండే ఖాళీ ప్రదేశంలో దాదాపు యాభై రకాల ఔషధ మొక్కలతోపాటు నవగ్రహాలు, వివిధ రాశులకు సంబంధించిన మొక్కలు కూడా నాటనున్నారు. దీని అంచనా వ్యయం రూ.15 లక్షలు. మరో రెండు నెలల్లో ఇది అందుబాటులోకి రానుందని కృష్ణ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement