
సాక్షి, హైదరాబాద్: తగ్గించిన వస్తు, సేవల పన్ను(జీఎస్జీ) ప్రయోజనాలు కచ్చితంగా ప్రజలకు అందేలా తూనికలు–కొలతల శాఖ నిఘా ముమ్మరం చేసింది. ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులకు సిద్ధమయ్యింది. ఇప్పటికే వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వర్తక, వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లపై 15 వేలకుపైగా తనిఖీలు చేసి 1,335 కేసులు నమోదు చేసి.. రూ.44.35 లక్షలను జరిమానా రూపంలో వసూలు చేసింది.
ప్రజలకు చేరని ప్రయోజనం..
కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించినా ఆ ప్రయోజనాలు ప్రజలకు చేరడం లేదు. కొంతమంది జీఎస్టీ ముసుగులో పాత ధరలకే అమ్మకాలు జరుపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిపై తూనికలు–కొలతల శాఖకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో జీఎస్టీని 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు.
అయితే తగ్గిన 13 శాతం పన్నును వివిధ రూపాల్లో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లలో జీఎస్టీ అమలుపై నిఘా ఉంచాలని తూనికలు–కొలతల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 9 ప్రకారం వినియోగదారుల రక్షణ చట్టం కింద ఇలా అక్రమ వ్యాపార లావాదేవీలు చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లపై కేసులు నమోదు చేసి వినియోగదారుల ఫోరంకు అప్పగించే అధికారం తూనికలు–కొలతల శాఖకు ఉంది.
అవగాహన తీసుకురావడంలో సఫలం..
జీఎస్టీ మోసాలు, సర్వీస్ చార్జీల విషయంలో ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో సఫలమయ్యాం. సర్వీస్ చార్జీ చట్ట వ్యతిరేకమని, అది వినియోగదారుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని వర్తకులకు తెలియజెప్పాం. ఏ వస్తువుపై ఎంత పన్ను ఉన్నా అది ఎంఆర్‌పీకి లోబడే ఉండాలి. ఎంఆర్‌పీకి అదనంగా వసూలు చేయకూడదని వ్యాపార సంస్థలకు, అదనంగా చెల్లించకూడదని వినియోగదారులకు అవగాహన కల్పించాం. – సీవీ ఆనంద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment