అమ్మతనం.. కరోనాపై జయం  | Special Storty About Corona Patients Giving Birth To Child In Hyderabad | Sakshi
Sakshi News home page

అమ్మతనం.. కరోనాపై జయం 

Published Sun, May 17 2020 8:58 AM | Last Updated on Sun, May 17 2020 9:07 AM

Special Storty About Corona Patients Giving Birth To Child In Hyderabad  - Sakshi

కడుపులో బిడ్డను నవమాసాలు మోసింది.. గుండెలకు హత్తుకొని ముద్దాడతానని మురిసిపోయింది.. గుండెల నిండా దాచుకున్న పాలతో చిన్నారి కడుపునింపి నిద్రపుచ్చాలనుకుంది.. కేకలు వేస్తూ బిడ్డ ఆడుకుంటుంటే చూసి ముచ్చట పడాలనుకుంది. కానీ అప్పటికే ఆమెకు కరోనా పాజిటివ్‌ అని రిపోర్టు రావడంతో తన నుంచి బిడ్డకు వైరస్‌ సోకుతుందేమోనని ఆందోళన చెందింది. అయితే కరోనాను జయిస్తూ ముద్దుగా, బొద్దుగా మూడు కిలోల బరువుతో కేర్‌మంటూ మగశిశువు బయటకు వచ్చాడు. తల్లి కళ్లలో మాతృత్వపు ఆనందం.. వైద్యుల్లో సంతోషాల వెల్లువ.. కరోనా పాజిటివ్‌ గర్భిణికి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన ఉద్వేగపు క్షణాలవి.. రాష్ట్రంలోనే తొలి కేసు ఇదే.. తల్లీబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులు అపరబ్రహ్మలుగా మారారు. కరోనా మహమ్మరిని జయించిన బిడ్డ ఎన్‌ఐసీయూ ఇంక్యూబేటర్‌లో డబ్బాపాలు తాగుతుండగా.. కోవిడ్‌ వార్డులో తల్లి కరోనా వైరస్‌తో పోరాడుతోంది. తల్లి స్పర్శ కోసం బిడ్డ తపించిపోగా.. పాలను అందించలేక తల్లి ఆవేదన చెందుతోంది.

గాంధీ ఆస్పత్రి : ఎక్కడ కరోనా పాజిటివ్‌ వచ్చినా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి పేరే వినిపిస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నిత్యం కరోనా బాధితులతో ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది. కరోనా మహమ్మారిని డాక్టర్లు సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. పేషెంట్లకు వైద్య సేవలు అందించి వారు త్వరగా కోలుకొని డిశ్చార్జి అయ్యేలా చేస్తున్నారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా.. వారికి అనుకోని ట్విస్ట్‌ ఎదురైంది. నిండు గర్భిణికి కరోనా పాజిటివ్‌ రావడంతో డాక్టర్లలో కాస్త ఆందోళన మొదలైంది. అప్పటి వరకు ఆ దిశగా ఆలోచించకపోయినా వెంటనే అన్ని విభాగాలను అలర్ట్‌ చేశారు. ఆస్పత్రి పాలనా యంత్రాంగంతో పాటు గైనకాలనీ, అనస్తీషియా తదితర విభాగాలకు చెందిన వైద్యులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించి గాంధీ గైనకాలనీ విభాగం లేబర్‌ వార్డును సిద్ధం చేశారు.  

మాతృత్వపు ఆనందం.. వైద్యుల్లో సంతోషం..  
పాతబస్తీ ఫలక్‌నమాకు చెందిన గర్భిణి ఈ నెల 7వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా మరుసటి రోజు శస్త్రచికిత్స నిర్వహించి పండంటి మగశిశువును అమ్మకడుపు నుంచి బయటకు తీశారు. పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్లు(పీపీఈ) ధరించిన వైద్యులు గర్భిణికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆలస్యం చేస్తే కడుపులోని బిడ్డకు ప్రమాదమని గ్రహించి శస్త్రచికిత్స నిర్వహించారు. కరోనాను జయిస్తూ ముద్దుగా, బొద్దుగా మూడు కిలోల బరువుతో కేర్‌మంటూ మగశిశువు బయటకు వచ్చాడు. తల్లి కళ్లలో మాతృత్వపు ఆనందం.. వైద్యుల్లో సంతోషాల వెల్లువ.. కరోనా పాజిటివ్‌ గర్భిణికి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన ఉద్వేగపు క్షణాలవి. కరోనాను జయిస్తూ ముద్దుగా, బొద్దుగా మూడు కిలోల బరువుతో కేర్‌మంటూ మగశిశువు బయటకు వచ్చాడు. శిశువుకు ఎలాంటి వైరస్‌ సోకకుండా శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందాయి. ఇలాంటి ఘటన రాష్ట్రంలోనే మొదటిది. కరోనా డెలివరీ విజయవంతంగా నిర్వహించిన గాంధీ గైనకాలజీ హెచ్‌ఓడీ మహాలక్ష్మీతోపాటు వైద్యబృందం అనిత, షర్మిల, సంగీత, ప్రసన్నలక్ష్మీ, అపూర్వ, రాణి, మృణాళిని, అశ్విని, శ్రీలక్ష్మితోపాటు అనస్తీషియా, పిడియాట్రిక్‌ విభాగ వైద్యులను వైద్య ఉన్నతాధికారులు అభినందించారు.  
(గ్రేటర్‌లో మళ్లీ కరోనా అలజడి..)

పుట్టుకతోనే కరోనాను జయించి..  
కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్న బహదూర్‌పురాకు చెందిన మరో గర్భిణిని ఈ నెల 10వ తేదీన గాంధీలో చేర్పించగా 13 తేదీన శస్త్రచికిత్స నిర్వహించగా మగశిశువు జన్మించాడు. నిర్ధారణ పరీక్షల్లో శిశువుకు కరోనా నెగిటివ్‌ రావడం గమనార్హం.  

తల్లిప్రేమకు దూరంగా.. 
పుట్టిన శిశువులు ప్రస్తుతం తల్లిప్రేమకు దూరంగా డబ్బాపాలు తాగుతూ ఎన్‌ఐసీయూ ఇంక్యూబేటర్‌లో పెరుగుతుండగా, ఇరువురు బాలింతలు కోవిడ్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. తల్లిపాలలో కరోనా వైరస్‌ ఉండదని తేలినా.. తల్లిద్వారా వైరస్‌ శిశువులకు సోకే అవకాశం ఉందని వారిని దూరంగా ఉంచుతున్నామని వైద్యులు వివరించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, వైద్యసేవల అనంతరం బాలింతలు కోలుకుంటున్నారని గైనకాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ మహాలక్ష్మి తెలిపారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన మరో నలుగురు గర్భిణులకు గాంధీ ఆస్పత్రి యాంటినెటల్‌ వార్డులో వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యులు స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement