ప్రకృతి సోయగాలు.. మైమరిపించే అందాలు.. మనసును ఉల్లాసపరిచే ప్రాంతాలు.. పరవళ్లు తొక్కే నదులు, రిజర్వాయర్లు.. ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి సోయగాలతోపాటు అబ్బురపరిచే మానవ నిర్మితాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక కథనం..
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు పర్యాటక స్థలాల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, దోమకొండ కోట, అలీసాగర్, కౌలాస్‌కోట, ఖిల్లా రఘునాథ ఆలయం, నవనాథ సిద్ధుల గుట్ట, అష్టముఖి కోనేరు, మల్లారం, బడాపహాడ్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులు తదితర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రతియేటా వేలాది మంది పర్యాటకులు వీటిని సందర్శిస్తున్నారు.
ఇదీ నేపథ్యం..
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను కోరింది. 1978 నుంచి ప్రపంచంలోని అనేక దేశాలు తమ దేశ వారసత్వ సంపద, అపురూప దృశ్యాలు, చారిత్రాక కట్టడాలు, అపురూప శిల్పాలు, ఆలయాలు, పర్యాటక స్థలాలను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్నాయి. ప్రజలలో వారసత్వ సంపదపై అవగాహన కల్పించడం పర్యాటక దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.
అలీసాగర్
నగరానికి 15 కిలోమీటర్ల దూరం, నిజామాబాద్–బాసర రోడ్డుకు 2 కి.మీ దూరంలో ఉంది. ఈ అలీసాగర్ రిజర్వాయర్‌ను 1930 దశకంలో నిర్మించారు. అలీసాగర్ ప్రకృతి రమణీయమైన ప్రదేశం. ఎంతో పర్యాటకులు తిలకించేందుకు వస్తుంటారు. సమ్మర్‌హౌస్, చక్కగా పెంచిన గార్డెన్స్, ఐలాండ్, లేళ్లపార్కు తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. బోటింగ్ సౌకర్యం ఉంది.
మ్యూజియం..
నగరం నడిబొడ్డున తిలక్‌గార్డెన్‌లో పురావస్తుశాఖ మ్యూజియం ఉంది. ఇక్కడ పాతరాతియుగం నుంచి విజయనగర కాలం క్రీస్తుశకం 16వ శతాబ్దానికి చెందిన వాటి వరకు మానవ నాగరికత వికాసాన్ని తెలియజేస్తాయి. మ్యూజియంలో పురావస్తు, శిల్పకళ, ఇత్తడి అలంకరణ వస్తువులు ఉన్నాయి. బింద్రి వస్తువులు, విసృత శ్రేణిలో ఆయుధాలు, యుద్ధసామగ్రి ప్రదర్శనకు ఉంచారు.
అశోక్‌సాగర్
బోధన్ వెళ్లే దారిలో నగరం నుంచి పది కిలోమీటర్ల దూరంలో అశోక్‌సాగర్ ఉంది. ఇక్కడ బోటింగ్ చేయొచ్చు. సెలవు రోజుల్లో సందర్శకులు ఎక్కువగా వస్తారు. సిర్నాపల్లి సంస్థానాధీశురాలైన శీలం జానకీబాయి ఈ చెరువు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. దీనిని రాక్ పార్కుగా, బోటింగ్ కేంద్రంగా అభివృద్ధి చేశారు. పిల్లలు ఇక్కడ బోటింగ్ చేసేందుకు ఇష్టపడతారు.
మల్లారం ఫారెస్ట్
మల్లారం అడవి జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. వలస పక్షులకు ఇది నిలయం. సహజమైన పరిసరాలు స్వచ్ఛమైన గాలి, పక్షులు వంటివి పర్యాటకుల కోసం పరిపూర్ణ విహారయాత్ర కేంద్రం. అటవీ పర్వతారోహణనకు అనుకూలంగా ఉంటుంది. మల్లారం చెరువుతో పాటు ప్రసిద్ధ పుట్టగొడుగు ఆకారంలో ఉండే రాయి చూపరులను ఆకట్టుకుంటుంది.
పోచారం ప్రాజెక్టు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు కామారెడ్డి పట్టణం నుంచి 42 కి.మీ దూరం ఉంటుంది. చుట్టూ నీరు.. మధ్యలో దట్టమైన అభయారణ్యం.. అందులో గంతులేసే వన్యప్రాణుల అందాలతో ఈ ప్రాజెక్టు పర్యాటకులకు కనువిందు చేస్తుంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి నీరు అలుగుపై నుంచి పారుతుంది. ప్రాజెక్టుకు రెండువైపులా రెండు అలుగులు ఉన్నాయి. అలుగుపై నుంచి కిందకు 20 అడుగుల కిందకు పడుతుంటే వాటర్‌ఫాల్స్‌ను తలపిస్తాయి. అలుగుపై నుంచి కిందకు ప్రవహించే నీటిలో పర్యాటకులు తడుస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే పోచారం ప్రాజెక్టుకు కిలోమీటరు దూరంలో అభయారణ్యం ఉంటుంది. అభయారణ్యంలో చుక్కల జింకలు, లేళ్లు, సాంబార్‌లు, నీల్‌గాయ్‌లు, నెమళ్లు సందర్శకులను ఎంతగానో అలరిస్తాయి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిర్మల్, ఆదిలాబాద్ వైపు వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సు ఎస్సారెస్పీ చౌరస్తా నుంచే వెళ్తుంది. అక్కడి నుంచి ప్రాజెక్టు వరకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టు పర్యాటకంగా ఎంతో రమణీయమైన ప్రాంతం. మిగులు జలాలు గోదావరిలో విడుదల చేసేందుకు నిర్మించిన 42 వరదగేట్లు ప్రాజెక్టుకే పెద్ద ఆకర్షణ. ప్రాజెక్టుపై నుంచి దిగువ భాగాన చూస్తే గలగల పారే గోదావరి ఓ వైపు, పచ్చని చెట్లు మరో వైపు, ఓ వైపు కాలువ, మధ్యలో రోడ్డు ప్రకృతి రమణీయంగా కనువిందు చేస్తాయి. ప్రాజెక్టు వద్ద పార్కు సైతం ఉంది.
బడాపహాడ్
జిల్లా కేంద్రం నుంచి 43 కి.మీ దూరంలో బడాపహాడ్ దర్గా ఉంది. సయ్యద్ హజ్రద్ షాదుల్లా హుసేన్ జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. ఇది వర్ని మండలం జాకోర సమీపంలో కొండపై ఉంది. సెప్టెంబర్ నెలలో జరిగే ఉర్సుకు జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు.
సిద్ధుల గుట్ట
ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయతకు నెలవు నవనాధ సిద్దుల గుట్ట, సహజ సిద్ధంగా నల్లని రాళ్లతో ఏర్పాడిన గుట్టపై ప్రకృతి సోయగాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పురాతన కాలంలోని మహర్షులు నిర్మించిన మందిరాలు ఆధ్యాత్మిక శోభను హృదయానికి హత్తుకునే వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. నవనాధులు పూజించిన సిద్దేశ్వరుడ్ని రాళ్ల గుహలోనికి వెళ్లిదర్శించుకోవడం చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. ఎత్తుయిన రాళ్ల గుట్టపై ఉన్న కోనేరు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంటుంది. పాలగుండం, నీటి గుండం ప్రత్యేక ఆకర్షణ.
రఘునాథ ఆలయం
ఇందూరు పూర్వ నామం ఇంద్రపురి. ఈ పట్టణంలో రఘునాథ ఆల యం, కోట రాష్ట్ర కూటులతో నిర్మించబడింది. ఇది 40 అడుగుల ఏకశిల విజయ çస్తంభం. రాష్ట్ర కూటుల ఏలుబడిలో నిర్మించ బడింది. ఈ కోటను క్రీస్తుశకం 1131లో అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆక్రమించుకున్నాడు. తదనంతరం బహమనీయులు, కుతుబ్‌షాహీలు, అనఫ్‌జాహీల వశమైంది. కోటలో బురుజులు ఉన్నాయి. విశాలమైన హాల్స్, వేసవి విడిదిలు ఉన్నాయి. బడా రాంమందిర్ ఈ కోట వైభవాన్ని వృద్ధి చేస్తుంది. దీన్ని చత్రపతి శివాజి గురువు సమర్థ రామదాసు నిర్మించారు.
డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం
డిచ్‌పల్లి దేవాలయం నిజామాబాద్ నగరానికి 20 కి.మీ దూరంలో హైదరాబాద్–నిజామాబాద్ జాతీయ రహదారిలో ఉంది. కొండ మీద ఉన్న అందమైన రామాలయం నలుపు తెలుపు అగ్గిరాయితో నిర్మించబడి ఉంది. కొండ ముందు భాగంలో ఉన్న ముఖద్వారం సందర్శకులకు ఆహ్వానం పలుకుతుంది. యాత్రికలను, పర్యాటకులను దేవాలయ గోడల మీద సీలింగ్స్ మీద, తలుపు చట్రాల మీద ఉన్న విశిష్టమైన నగిశీలు ఆశ్చర్య పరుస్తాయి. ఆలయ దక్షిణ భాగన పెద్ద ట్యాంకు ఉంది. దాని మధ్యలో స్తంభాల మండపం ఉంది.
దోమకొండ కోట
దోమకొండ కోట చరిత్రకు నిలువుటద్దంగా నిలుస్తోంది. ఇక్కడ అద్దాల మేడ, రాణి మహల్, మహాదేవుని ఆలయాలున్నాయి. కామినేని వంశీయుల చివరి రాజధానిగా వర్ధిల్లిన ఈగ్రామంలో శివరామమందిరం, చాముండేశ్వరి ఆలయం దర్శనీయమైనవి. కోటలో అద్దాల మేడ, దర్బారుహాల్, నాట్యశాల, అంతఃపురాలను అద్భుతంగా నిర్మించారు. కోట లోపల మహాదేవుని ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. దీనిని 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కామారెడ్డి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని నుంచి వంద కిలోమీటర్ల దూరంలో దోమకొండ మండల కేంద్రంలో ఈ సంస్థానం ఉంది.
నీలకంఠేశ్వరాలయం
నగరంలో శాతవాహన రాజు శాతకర్ని–2 ద్వారా నిర్మింపబడింది కంఠేశ్వర్‌లోని నీలకంఠేశ్వరాలయం. ఉత్తర భారతీయ వాస్తు కళకు ఈ ఆలయం అద్దం పడుతుంది. ప్రతియేటా రధసప్తమి పండుగను ఈ ఆలయంలో వైభవంగా నిర్వహిస్తారు.
సారంగాపూర్ ఆలయం
నగర శివారులో ఉన్న సారంగాపూర్ హనుమాన్ మందిరాన్ని ఛత్రపతి శివాజీ మహరాజ్ గురువు సమర్ధ రామదాసు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయానికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. ఆలయ పరిసరాల్లో ప్రకృతి రమణీయత ఉట్టిపడుతుంది. భక్తులు సేదతీరేందుకు గార్డెన్‌ను అబివృద్ధి పరిచారు. పిల్లలకు ఆటపరికరాలను అందుబాటులో ఉంచారు.
చరిత్రకు సాక్ష్యం
జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్‌లో అపురూప చారిత్రక విశేషాలను తెలియజేసే వస్తువులు, నాటి నాణేలు, నిజాం ఆయుధాల వంటివి పురావస్తు ప్రదర్శన శాలలో ఉంచారు. మరమ్మత్తుల పేరుతో ఈ ప్రదర్శన శాలను నాలుగేళ్లుగా మూసి ఉంచారు. దీనిని తెరిపిస్తే జిల్లాలోని చారిత్రక అంశాలను తెలుసుకునే అవకాశం ఎంతో మందికి లభిస్తుంది.
– దిలీప్, సీతారాంనగర్ కాలనీ
ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి
మానసిక ప్రశాంతతను కలిగించే పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఎంతో ఉంది. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిర్లక్ష్యం చేస్తే అపురూప వారసత్వ సంపద కనుమరుగయ్యే అవకాశం ఉంది. మన జిల్లాలో చూసేందుకు ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయాలి.
– వెంకటలక్ష్మి, వినాయక్‌నగర్
పర్యాటకాభివృద్ధికి కృషి
పర్యాటక రంగాన్ని భావితరాలకు పరిచయం చేయటానికి ప్రత్యేక ప్రణాళికలను తయారుచేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో అనేక పర్యాటక కేంద్రాలున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పర్యాటక దినోత్సవం సందర్భంగా గాంధీచౌక్ నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు హెరిటేజ్ వాక్, ఫుడ్ ఫెస్టివల్ తదితర ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం.
– సింహాచలం, పర్యాటక శాఖాధికారి
జుక్కల్ మండలంలోని కౌలాస్ కోట
Comments
Please login to add a commentAdd a comment