కిచెన్‌ బయోగ్యాస్‌ | Special Story On Kitchen Biogas In Hyderabad | Sakshi
Sakshi News home page

కిచెన్‌ బయోగ్యాస్‌

Published Fri, Jun 15 2018 10:52 AM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Special Story On Kitchen Biogas In Hyderabad - Sakshi

గచ్చిబౌలి: కిచెన్‌ నుంచి నిత్యం వచ్చే వేస్ట్‌ను వృథాగా పడేయకండి. ఆ వ్యర్థాలతో ఎంచక్కా గ్యాస్‌ ఉత్పత్తి చేసుకోండి. పోర్టబుల్‌ బయోగ్యాస్‌ మిషన్‌తో ఇట్టే వండుకోండి. మిషన్‌ నుంచి వెలువడే ద్రవ పదార్థాన్ని మొక్కల ఎరువుగా వాడుకోండి. కిచెన్‌ వ్యర్థాలు బయట పడేసేందుకు ఇక స్వస్తి పలకండి. జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోనల్‌ అధికారులు బయోగ్యాస్‌ మిషన్‌లో కిచెన్‌ వ్యర్థాలు వేసి గ్యాస్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎవరికి వారు కిచెన్‌లో ఫోర్టబుల్‌ బయోగ్యాస్‌ మిషన్‌ను అమర్చుకోవచ్చు. ఇప్పటికే చందానగర్‌ సర్కిల్‌లో పోర్టబుల్‌ బయోగ్యాస్‌పై డెమో నిర్వహించారు.    

ప్రయోజనాలెన్నో..
బహుళ ప్రయోజనాలు కల్గిన పోర్టబుల్‌ బయో గ్యాస్‌ను జీహెచ్‌ఎంసీలో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం సన్‌గ్రీన్‌ ఆర్గానిక్‌ వ్యవస్థాపకురాలు అరుణా శేఖర్‌ చందానగర్‌ సర్కిల్‌–20లో పోర్టబుల్‌ బయో గ్యాస్‌పై అవగాహన కల్పించారు. దీనిపై వేస్ట్‌ 500 గ్రాముల తడి చెత్త నుంచి 100 కిలోల తడి చెత్త వెలువడే మిషన్‌లను అమర్చుకోచ్చు.

ఇలా పని చేస్తుంది..
పోర్టబుల్‌ బయోగ్యాస్‌ మిషన్‌ను కిచెన్‌ బాల్కనీలో పెట్టి పైపును కిచెన్‌లో ఉంచుతారు. మిషన్‌తో పాటు స్టౌ కూడా ఉంటుంది. మిషన్‌ వెంట వచ్చిన బయో కల్చర్‌తో పాటు ఆవు పేడను గుజ్జుగా కలిపి డబ్బాలో వేస్తారు. ఆ తర్వాత మిగిలిపోయిన అన్నం, పండ్లు, కూరగాయల తొక్కలు, సాంబారు, బియ్యం కడిగిన నీళ్లు, మిగిలిపోయిన బోన్‌ లెస్‌ మాంసం ముక్కలను అందులో వేయాలి. 24 గంటల అనంతరం గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. మిషన్‌కు మూత ఉండటంతో ఎలాంటి దుర్వాసన రాదు. నిత్యం వాడితే కొద్దిమొత్తంలో వేస్టేజ్‌ బయటకు వస్తుంది. దానిని పూలు, కూరగాయలు, చెట్లకు ఎరువుగా వాడవచ్చు. 2 కిలోల తడి చెత్త సామర్థ్యం కలిగిన ఫోర్టబుల్‌ బయో గ్యాస్‌ మిషన్‌ విలువ రూ.40,000 ఉంటుంది. రెండు కిలోల చెత్తతో రోజు అర గంట నుంచి గంట సేపు గ్యాస్‌ను ఉపయోగించుకోవచ్చు. కాఫీ, టీతో పాటు ఇతర వంటలు చేసుకునే వీలుంది.

ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం..
పోర్టబుల్‌ బయోగ్యాస్‌ను ఉపయోగించడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తోంది. కేరళలో ఈ గ్యాస్‌ ఎంతో సక్సెస్‌ సాధించింది. తడి చెత్తతో గ్యాస్‌ ఉత్పత్తితో పాటు ఎరువు వస్తోంది. పోర్టబుల్‌ బయోగ్యాస్‌పై ఇప్పటికి వెయ్యికిపైగా అవగాహన  కార్యక్రమాలు నిర్వహించాం. గృహాలు, స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా బయోగ్యాస్‌ను ఉపయోగించాలని ప్రజలను చైతన్యం చేస్తున్నాం. – అరుణా శేఖర్, సన్‌గ్రీన్‌ ఆర్గానిక్‌ ఫౌండర్‌  

నా కార్యాలయం నుంచే మొదలు..  
పోర్టబుల్‌  బయోగ్యాస్‌ను ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఎక్కడా ఉపయోగించలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ గ్యాస్‌పై అవగాహన కల్పిస్తున్నాం. రెండు రోజుల్లో పోర్టబుల్‌ బయోగ్యాస్‌ మిషన్‌ను శేరిలింగంపల్లి వెస్ట్‌ జోన్‌ కార్యాలయంలో అమర్చనున్నారు. ఉద్యోగుల లంచ్‌లో వచ్చే వ్యర్థాలతో బయోగ్యాస్‌ను ఉపయోగించుకొని టీ, కాఫీ చేసుకోనున్నాం. ఇప్పటికే చందానగర్‌లో నిర్వహించిన డెమో ద్వారా పోర్టబుల్‌ బయోగ్యాస్‌ మిషన్‌ బాగా పనిచేస్తుందనే నమ్మకం కలిగింది.  – హరిచందన, వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement