ఆమే ఒక సైన్యం! | Special Story on NGO Harika | Sakshi
Sakshi News home page

ఆమే ఒక సైన్యం!

Published Tue, May 14 2019 7:26 AM | Last Updated on Thu, May 16 2019 11:47 AM

Special Story on NGO Harika - Sakshi

రక్తదాన శిబిరంలో హారిక తదితరులు (ఫైల్‌)

నగరానికి చెందిన ఈరంకి నాగభూషణం, జానకి దంపతులు కుమార్తె హారిక ఎంబీఏ పూర్తి చేసింది. ఓ పేరున్న కంపెనీలో ఉద్యోగాన్ని సైతం సాధించింది. ఉద్యోగంతో పాటు సేవా కార్యక్రమాలను సైతం చేయసాగింది. ఈ క్రమంలో సేవా కార్యక్రమాలకు ఉద్యోగం అడ్డుగా ఉందని భావించి దానికి రాజీనామా చేసి 2016లో ‘అనర్ఘ్య’ పేరుతో ఓ ఎన్జీఓను స్థాపించింది.  

హిమాయత్‌నగర్‌ :సమాజం మనకేమిచ్చిందన్నది కాదు.. సమాజానికి మనమేం చేశామన్నదే ప్రధానమంటోంది ‘అనర్ఘ్య’ ఎన్‌జీఓ వ్యవస్థాపకురాలు హారిక. యువతరం తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదంటోంది. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న ఎంతో మందికి రక్తదానం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నడుంకట్టింది. ఐదంకెల జీతాన్ని సైతం వదులుకుని సేవా దృక్పథంతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి పేద పిల్లలకు వసతులు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోందిఈరంకి హారిక.

రక్తదానంతో ప్రాణదాత
2013లో ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి తాను రక్తం ఇచ్చి ఆదుకుంది. ఆ తర్వాత తండ్రి నాగభూషణం, తల్లి జానకి, సోదరుడు డాక్టర్‌ హరీష్, సోదరితో సైతం రక్తదానం చేయించింది. తన ఎన్జీఓ, మిత్రులు, వారి స్నేహితులు ద్వారా వందలాది మందికి రక్తదానం చేయించినట్లు హారిక పేర్కొంది. ఒక్క ఫోన్‌ కాల్‌తో నగరంతో పాటు, ఏపీలోని పలు ప్రాంతాల్లో రక్తం అందించేందుకు కృషి చేస్తూ ప్రాణదాతగా నిలుస్తోంది.   

పాఠశాలల్లో మరుగుదొడ్లు..  
నగర శివారు ప్రాంతాలైన శివరాంపల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్‌ ప్రభుత్వ పాఠశాలలను తాను సందర్శించిన సమయంలో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నట్లు గ్రహించిన హారిక.  ఈ విషయమై ప్రభుత్వ అధికారులను నిలదీసింది. వారినుంచి నిధులు లేవనే సమాధానం రావడంతో.. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తన సొంత డబ్బులతో మరుగుదొడ్ల నిర్మించింది. నెలసరి సందర్భంగా ప్యాడ్లు కొనే ఆర్థిక స్థోమత లేని పలువుర విద్యార్థినులకు ఏడాదికి సరిపడా వాటిని ఉచితంగా పంపిణీ చేస్తోంది.  

24 గంటల్లో తాగునీరు..
శివరాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు లేకపోవడంతో.. విషయాన్ని అక్కడి విద్యార్థులు హారిక దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన హారిక అక్కడి ప్రధానోపాధ్యాయుడిని నిలదీసింది. స్పందన లేకపోవడంతో మండల విద్యాశాఖ అధికారిని అడగ్గా.. ఆయన నిధులు లేవన్నారు. పాఠశాలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను కోరగా.. వారు  కొత్త కనెక్షన్‌ కోసం రూ.78 వేలు అడిగారు. దీంతో ఆమె అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు ఫోన్‌ చేసింది. ‘నేను మంత్రి హరీష్‌రావును మాట్లాడుతున్నా. మీరు ఏం చేస్తారో  తెలియదు సదరు పాఠశాలకు 24 గంటల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలి’ అని అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో అధికారులు 24 గంటల్లోనే తాగునీటి వసతి కల్పించినట్లు హారిక వివరించింది. గతంలో పలువురు విద్యార్థులను ఆటో డ్రైవర్ల వేధింపుల నుంచి రక్షించింది. ఇలా ఎన్నో విధాలుగా సామాజిక సేవలో తరిస్తోంది నగర యువతి హారిక.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement